బాబు సరిగ్గానే ఆలోచిస్తున్నారు… తమ్ముళ్లకే అర్ధం కావడంలేదు!

-

అమరావతిలోనే పూర్తి రాజధాని కాకుండా… మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంలో భాగంగా… అందుకు ముందడుగుగా పాలనా వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అయితే… ఈ నిర్ణయంపట్ల కొన్ని వర్గాలు వ్యతిరేకించడం.. దీక్షలూ గట్రా చేయడం జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు చాలా చాకచక్యంగా ఆలోచిస్తూ ముందుకువెళ్తున్నారని అంటున్నారు విశ్లేషకులు!

chandrababu
chandrababu

జగన్ గురించి, తనమార్కు పాలన చూపించే విషయంలో వెనక్కి తగ్గే ఆలోచన చేయరనేది అందరికీ తెలిసిందే. ఈ విషయంలో జగన్ గురించి మరింత ఎక్కువగా తెలిసిన, మరింత దగ్గరగా ఆ ప్రభావం చూసిన చంద్రబాబు.. అమరావతి – మూడు రాజధానుల విషయంలో పక్కా ప్లానింగ్ గా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. అందులో భాగంగా… ఇటు అమరావతి కోసం తాను పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తూనే… మిగిలిన ప్రాంతాలకు శత్రువు కాకుండా చూసుకుంటున్నారు!

అవును… 40 ఏళ్ల అనుభవం, ఆర్థిక బలం, ఒక సామాజిక వర్గ బలం పుష్కలంగా కలిగిఉన్న బాబు.. తలచుకుంటే అమరావతి విషయంలో దూకుడు ప్రదర్శించేవారు! తనదైన మార్కు పోరాటాలు చేసి.. తనదైన మార్కు చక్రాలు తిప్పి.. అమరావతిని ఆపగలిగేవారు! ఇప్పుడు బాబు తలచుకున్నా కూడా.. అమరావతిని ఆపగలిగేటంతపని చేయగల సమర్థత, సామర్ధ్యం బాబు సొంతం! కానీ… రాజకీయ అవసరాల దృష్ట్యా తనను నమ్మి మూడు పంటలు పండే భూములిచ్చిన రైతులకు సైతం వెన్నుపోటు పొడుస్తున్నారు అనే కామెంట్లు పడుతున్నాయి!

అవును… అమరావతి కోసం మాత్రమే పోరాడితే, రాజినామాలు చేసేటంత పనిచేస్తే… ఫ్యూచర్ ఏమిటో బాబుకు తెలుసు! ఉన్న 20 / 23 కూడా మిగలరనే విషయం బాబుకు సుస్పష్టం. అలా అని అమరావతి కోసం భూములిచ్చిన రైతులను అడ్డంగా వదిలేస్తే.. పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది! అలా అని పూర్థిస్థాయిలో సమర్ధిస్తే… మిగిలిన చోట భవిష్యత్తు లేకుండా పోతుంది. సో… అమరావతిపై ఆన్ లైన్ లో ప్రేమ కురిపిస్తూ, రాజధాని రైతులకు జూం లో మద్దతు ప్రకటిస్తూ క్లాస్ లు తీసుకుంటూ… తన పోరాటాన్ని అలా అలా అలా పై పైన చేసుకుంటూపోతున్నారు బాబు!!

చంద్రబాబు ఇంత పక్కాగా ప్లాన్ చేసుకుని ఆన్ లైన్ కి పరిమితమైతే… తమ్ముళ్లేమో అర్ధం చేసుకోకుండా… ఆవేశపడుతూ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ఏదో ఒకటి చేయండని ఒత్తిడి తెస్తున్నారు!! బాబుకున్న అనుభవం వారికెక్కడిది..!!?

Read more RELATED
Recommended to you

Latest news