నేను ప్లాన్ వేస్తే.. తిరుగు ఉంటుందా? అని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన తాజా ప్లాన్ అట్టర్ ప్లాప్ అయిందనే వాదన వినిపిస్తోంది. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ప్రస్తుత జగన్ సర్కారును ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు వేయని ప్లాన్ అంటూ లేదు. ఈ క్రమంలో ధర్నాలు, నిరసనలు అంటూ రోడ్డెక్కారు. అదేసమయంలో అసెంబ్లీలోనూ భారీ ఎత్తున విమర్శ లు గుప్పించారు. విషయం ఏదైనా సరే.. తనదైన శైలిలో ఆయన దూసుకుపోయారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ తీసుకున్న అనేక కీలక విషయాలపై తన వారిని అడ్డు పెట్టుకుని న్యాయ పోరాటాల పేరుతోనూ కోర్టుల్లో కేసులు వేయించారనే వాదన తన పార్టీలోనే వినిపిస్తుంటుంది.
అయితే, చంద్రబాబు వేసిన ఈ ప్లాన్‌లు, పాట్లలో ఒకటి రెండు మినహా అన్నీ విఫలమయ్యాయి. తాజాగా కూడా ఆయన చక్కటి ప్లాన్ వేశారు. ఇంకేముంది.. జగన్ ప్రభుత్వం .. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బద్నాం అవుతుందని భావించారు. అయితే, దీనికి భిన్నంగా జరిగింది. రాజధాని అమరావతిని ఇక్కడ నుంచి తరలించేందుకు జగన్ సర్కారు మూడు రాజధానుల విషయాన్ని తెరమీదికి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అబివృద్ధి వికేంద్రీకరణ అనే పేరు పెట్టడంతోపాటు.. ప్రస్తుత రాజధానిలో టీడీపీ నేతలు భారీ ఎత్తున మాఫియాకు పాల్పడ్డారని, ముందస్తుగానే భూములనుకొనుగోలు చేశారని జగన్ అసెంబ్లీలోనే ఆరోపించారు. అయితే, వీటిపై చంద్రబాబు ఏమీ బాధపడలేదు. ఎలాంటి ఆందోళన చేయలేదు.
కానీ, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. తానే స్వయంగా రంగంలోకి దిగి ఆందోళనల ను చేపట్టారు. తన సతీమణి భువనేశ్వరి ఏకంగా.. చేతికి ఉన్న రెండు గాజులను ఇచ్చేలా చేశారు. అమరావతి సాధన సమితి ఏర్పాటులోనూ బాబు కీలకంగా వ్యవహరించారు. ఉద్యమం కొనసాగించేందుకు అంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బాబు.. జోలెపట్టా రు. ఇలా తనదైన శైలిలో ఉద్యమానికి ఊపు తెచ్చారు. కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆందోళనలు కొనసాగేలా వ్యవహరించారు. ఇళ్ల నుంచే రైతులు తమ ఆందోళనలు చేసేలా ప్రోత్సహించారు. ఇలా చంద్రబాబు అనేక రూపాల్లో ఇక్కడ ప్రజలను ముందుకు నడిపించారు.
పైకి లేదు.. లేదని చెప్పినా.. అమరావతి ఉద్యమం వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబు తానై నడిపిస్తున్నారనే జగమెరిగిన సత్యం. అయితే, తాజాగా ఏపీకి.. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి వంటివారు వచ్చారు. ఏపీలో షూటింగులు ప్రారంభం.. నంది ఉత్సవాల నిర్వహణ, సినిమా ధియేటర్ల ప్రారంభం వంటివాటిపై నేరుగా సీఎం జగన్‌తో చర్చించేందుకు వారు ఏపీకి వచ్చారు. అయితే, ఇదే సమయంలో చంద్రబాబు చక్కని ప్లాన్ వేశారు. అమరావతి విషయంపై సినీ ప్రముఖులతో ఎలాగైనా నోరు విప్పేలా చేయాలని భావించారు.
తన చేతికి మట్టి అంటకుండా.. రైతులను రోడ్డుపైకి పంపారు. సినీ ప్రముఖులు రాజధాని ప్రాంతంలో బసచేసిన గెస్ట్‌హౌస్ వద్దకు పదుల సంఖ్యలో రైతులు చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే, ఈ ఆందోళనలను వారు పట్టించుకోలేదు. పైగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. రైతులను ఇంటికి పంపారు. మొత్తంగా బాబు ప్రయాస వృథా అయిందనే వాదన కన్నా.. బాబు ప్లాన్ విఫలమైందనే వాదన బలంగా వినిపిస్తోంది.