గతంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసినప్పుడు.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు.. తీసుకువస్తామని చెబుతున్నప్పుడు.. ఏమౌతుందో ఏమో తెలియదుకానీ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం వెంటనే వెయ్యివాట్స్ బల్బు వెలుగుతుంది. ఆయా కార్యక్రమాలను, పథకాలను ప్రవేశ పెట్టిన వారు, ప్రకటించిన వారు కూడా ప్రచారం ప్రారంభించక ముందుగానే చంద్రబాబు ప్రచార పర్వానికి దిగిపోతారు. ఇది నావిజన్.. అంటూ ఆయన దూకిపోతారు. మోడీ ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు వెనువెంటనే స్పందించిన చంద్రబాబు.. ఇది నా ఐడియా అంటూ.. ప్రకటించుకున్నారు. తాను పదే పదే ప్రధానికి ఈ విషయంలో విజ్ఞప్తి చేశాను కాబట్టే.. రద్దు చేశారన్నారు.
వారం తిరగకుండానే నోట్ల రద్దుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు,, కేంద్రం రూ.2000 నోటును ప్రవేశ పెట్టినప్పుడు చంద్రబాబు నాలిక కరుచుకున్నారు. అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. ఇక, ఇప్పుడు జగన్ విద్యుత్ సంస్కరణలు అంటూ.. (సాధ్యమవుతుందో కాదో.. ఆయనకే తెలియదు..) పాట పాడుతున్నారు. రైతులు వినియోగించే విద్యుత్కు మీటర్లు పెడతామని చెబుతున్నారు. వాస్తవానికి ఇది రైతులకు వ్యతిరేకమైన సబ్జెక్ట్. కానీ, మంత్రి పేర్ని నాని.. కేబినెట్‌లో తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే స్పందించిన చంద్రబాబు.. ఇది నా ఆలోచనే! అంటూ ప్రచారానికి దిగారు. సంస్కరణలకు ఆద్యుడు తానేనని ప్రకటించుకున్నారు.
ఓ రెండు గంటలు గడిచిన తర్వాత ..జగన్ ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్ సంస్కరణలు తెలుసుకుని నాలిక కరుచుకున్నారు చంద్రబాబు. ఇది అక్రమం, అన్యాయం అంటూ.. గొంతు సవరించుకున్నారు. రైతులకు శాపమంటూ.. ఇప్పుడు తిట్టదండకం అందుకున్నారు. ఇలా అన్ని విషయాల్లోనూ చంద్రబాబు ఇంకా ప్రచారం పిచ్చిని వదులుకోకపోవడంపై సర్వత్రా తమ్ముళ్లలోనే ఆగ్రహం వ్యక్తం అవుతుండడం గమనార్హం. ఇక, తాజాగా కేంద్రం ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తొలిర్యాంకు దక్కింది. సరే.. ఈ సర్వే.. 2019 ఆగస్టు వరకు జరిగిన సర్వే అని కేంద్రమే ప్రకటించింది.
దీనిని బట్టి మేలోనే పాలనా పగ్గాలు చేపట్టిన జగన్‌కు కూడా దీనిలో భాగం ఉందనే చెప్పాలి. ఇక, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన.. ఫిబ్రవరి వరకు పాలించారు కాబట్టి చంద్రబాబు కూడా ఫిఫ్టీ పర్సెంట్ దక్కుతుంది. కానీ, బాబు గారు మాత్రం ఫుల్‌గా తన ఖాతాలోనే దీనిని వేసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవం ఏంటో.. ఆయన మౌనంగా ఉన్నా.. ప్రజలు తెలుసుకోరా? అనేది ప్రధాన ప్రశ్న. ఏదేమైనా.. రాష్ట్రంలో చంద్రబాబు తన వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
-vuyyuru subhash