రాష్ట్రంలో ప్రధానమైన ఓటు బ్యాంకుగా ఉన్న దళితుల విషయం ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు వివాదం అవుతూనే ఉంది. నాయకులు, పార్టీలు కూడా దళితులను ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే వినియోగించారు.. వినియోగిస్తున్నారు. ఈ విషయంలో నాడు-నేడుకు ఎక్కడా తేడాలేదు. అయితే, ఎటొచ్చీ.. తేడా ఒక్కటే.. అనుకూల శక్తులు.. వ్యతిరేక శక్తుల గుంజాటనే! కొన్ని సందర్భాల్లో చాలా విషయాలు మరుగున పడతాయి. దీనికికారణం అనుకూల శక్తుల మౌనం.. మరికొన్ని సందర్భాల్లో చిన్ని విషయాలు కూడా పెద్దగా ప్రొజెక్ట్ అవుతాయి.. వ్యతిరేక శక్తుల విజృంభణనే దీనికి కారణంగా చెప్పాలి.
రాష్ట్రంలో ఎస్సీ వర్గాలకు ఏ ప్రభుత్వంలోనూ రక్షణ లేకుండా పోయిందనేది నిర్మొహమాటంగా చెప్పాల్సిన విషయం. చంద్రబాబు హయాంలోనూ ఇంతకంటే ఎక్కువగానే ఎస్సీలను అణిచి వేశారు. అంతేకాదు, ఏకంగా ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అంటూ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జాతీయ హక్కుల కమిషన్ కూడా తప్పుబట్టింది. ఇక, రాజధానికి భూములు ఇవ్వనన్న ఎస్సీ రైతును రాత్రికి రాత్రి పోలీసులు స్టేషన్లకు తిప్పి మరీ అరికాళ్లు పగిలేలా కొట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వా ఫ్యాక్టరీని వ్యతిరేకించిన ఎస్సీలకు ఎంత గౌరవం లభించిందో బాబు గారి పాలన కళ్లకు కడుతుంది.
సో.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలోనే ఇలా ఉంటే.. తాజగా సీఎం అయిన జగన్ పాలనలోనూ పరిస్థితి దీనికన్నా భిన్నంగా ఉంటుందని ఊహించలేకపోవడం ఇప్పుడు గ్రహపాటు. మార్పు మనుషుల్లో రావాలి.. అది సమాజానికి మార్గదర్శనం కావాలని అంటారు వివేకానందుకు. మరి మనుషులు మారుతున్నారా? అంటే.. నేతిబీరలను తలపిస్తున్నారు తప్ప.. మారుతున్నదెక్కడ? అనే ప్రశ్న వినిపిస్తోంది. రిజర్వేషన్లు పెట్టుకున్నాం.. వారికి గౌరవం ఇస్తున్నామని చెప్పుకొంటున్నామే.. తప్ప… నిజమైన ఆత్మగౌరవం ఎస్సీలకు లభిస్తోందా? ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ శాఖల అధికారుల తీరు మారనంతవరకు ఎస్సీలకు దక్కే గౌరవం.. లాఠీల నుంచే.. ఛీత్కారాల నుంచే!!