స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ నేతను సీఐడీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చేరుకున్న సీఐడీ అధికారులు చంద్రబాబును విచారిస్తున్నారు. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో 12 మంది సభ్యుల సీఐడీ బృందం ఆయన్ను విచారిస్తోంది. చంద్రబాబును ప్రశ్నించేందుకు కాన్ఫరెన్స్ హాల్‌ను జైలు అధికారులు సిద్ధం చేశారు. విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని ఏసీబీ కోర్టు సూచించిన విషయం తెలిసిందే. శని, ఆదివారాలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే విచారించాలని, గంటకోసారి అయిదు నిమిషాల విరామమిచ్చి న్యాయవాదిని సంప్రదించుకునేందుకు అవకాశమివ్వాలని తెలిపింది. చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో రికార్డు చేస్తున్నారు.