దీపం పథకం అమలు, విధివిధానాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ నుంచి దీపావళి సందర్భంగా దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఏడాదికి ఉచితం. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీపావళి నుంచి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగు. ఆర్థిక సమస్యలు ఉన్నా.. పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతాయి.
రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగి, అర్హతగల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈనెల 24 నుండి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో దీపం పథకం తెచ్చాము. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర 876 లు కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు 25ల సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర 851. దీనివల్ల ప్రభుత్వంపై 2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుంది. ఐదేళ్ళకు కలిపి 13వేల 423 కోట్ల అదనపు భారం పడుతుంది అని పేర్కొన్నారు.