ప్రజాయుద్ధనౌక గద్దర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఇటీవల గుండెకు సంబంధించిన ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గద్దర్. కాగా ఆదివారం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సూర్యం వెల్లడించారు.
ప్రజా కవి గద్దర్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ప్రజా కవి, గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారు. ఆయన మరణం ఊహించనిది. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందాం” అన్నారు సీఎం జగన్.