గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు మరో మూడు కంపెనీల నిర్మాణ పనులకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపన చేశారు. క్రిబ్‌కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ పుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించి, శంకుస్ధాపన చేయడంతో పాటు గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధను ప్రారంభించారు సీఎం జగన్.
ఈ కంపెనీలతో దాదాపుగా రూ. 1425 కోట్ల పెట్టుబడి రానుండగా.. 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఇక ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సీఈఓ ఎల్ శ్రీధర్ రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.