ఈనెల 27న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం పర్యటన సందర్భంగా అమ్మ ఒడి పథకం మూడో విడతను విడుదల చేయనున్నారు. అదే రోజు శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్లుగా నిర్మించే విస్తరణ పనులను జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందు సీఎం కార్యక్రమ సమన్వయకర్త ఎమ్మెల్సీ తలశిల రఘురాం శ్రీకాకుళం పర్యటన చేపట్టనున్నారు. అధికారులతో సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళంలో సోమవారం ఉదయం 11 గంటలకు అమ్మఒడి పథకం మూడో విడత లబ్ధిదారులను ఉద్దేశించి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. కాగా ఇటీవల టిట్లి తుఫాన్, వంశధార ప్రాజెక్టు కింద నష్ట పరిహారం పొందుతున్న లబ్ధిదారులను కూడా ముఖ్యమంత్రి కలుసుకోనున్నారు.