క్రాప్ హాలిడే పై జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఏపీ స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పంట బీమా పై రైతులకు అభ్యంతరాలు ఉంటే ఆర్బీకేలను సంప్రదించవచ్చని తెలిపారు. వచ్చే 15 రోజులు విండో పిరియడ్ గా పెట్టామని పేర్కొన్నారు. ఏపీలో క్రాప్ హాలిడే ఎక్కడా ప్రకటించ లేదని వెల్లడించారు.
రబీ, ఖరీఫ్ కు మధ్య నిర్వహణ పనులకు సమయం తక్కువగా ఉంది.. ఖరీఫ్ ఆలస్యం అయితే రైతులు మూడు విధాలుగా నష్ట పోతున్నారు.. అందుకే మొదటిసారి ఒక నెల ముందుగానే నీళ్ళు విడుదల చేస్తున్నామన్నారు. క్రాప్ హాలిడే కాదు ముందస్తు పంట జరుగుతోంది.. ఉప్పు నీటి ప్రాంతాల్లో ఎప్పుడూ పంట వేయరన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభించామని.. 26 రకాల పంటలకు బీమా సౌకర్యం ఉందన్నారు.
పంటల బీమా ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగింది.. ఈ-క్రాప్ విధానం ద్వారా పంట అంచనా, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం.. ఐదేళ్లలో రెట్టింపు సంఖ్యలో రైతులకు బీమా సౌకర్యం విస్తరించామని తెలిపారు. అన్ని రకాల ఉద్యానవన పంటలకూ బీమా వర్తిస్తుంది.. కొర్ర, రాగి వంటి మిలెట్స్ కు కూడా పంట బీమా అమలు చేస్తున్నామని. ఖరీఫ్ కు పూర్తిగా సిద్ధంగా ఉన్నామన్నారు. రైతు ఆత్మహత్య మన రాష్ట్రానికే పరిమితం కాదు.. గత మూడేళ్లుగా రైతు ఆత్మహత్య సంఖ్య క్రమంగా తగ్గుతోందని వివరించారు. సీసీఆర్సీ కార్డులు ఉన్న కౌలు రైతులతో బృందాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.