కార్తీకమాసం నాలుగోవ చివరి సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగ లో భక్తజనం పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు భక్తులు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నారు. క్యూలైన్లలో వేలాదిమంది భక్తులు వేచి ఉండడంతో దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. ముక్కంటి క్షేత్రం శివనామస్మరణతో మార్మోగుతోంది.
ఇక… తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో.. భక్తులు వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్య స్నానాలతో రాజమండ్రిలో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లు భక్తులతో నిండిపోయాయి. స్నానాలు ఆచరించి గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు భక్తులు. కార్తిక నోములు ఉన్న వారు కుటుంబ సమేతంగా విచ్చేసి గోదావరి నదిలో స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలు చేపడుతున్నారు.