ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి బీజేపీలో చేరారు. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్‌సింగ్, లక్ష్మణ్ సమక్షంలో ఇవాళ ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారని.. దీంతో ఏపీలో తమ పార్టీ బలోపేతం అవుతుందని ప్రహ్లాద్ జోషి చెప్పారు. నల్లారి కుటుంబంలోని 3 తరాలు ప్రజలకు సేవలు అందించాయని తెలిపారు. ఎమ్మెల్యే, సభాపతి, సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి సేవలు అందించారని గుర్తు చేశారు. మోదీ పరిపాలన నచ్చి కిరణ్‌కుమార్‌రెడ్డి తమ పార్టీలో చేరారని వెల్లడించారు. అవినీతిపై మోదీ తీసుకుంటున్న చర్యలు ఆయన్ను ఆకట్టుకున్నాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి వివిధ పదవులు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఇప్పుడు బీజేపీలో చేరారు.