దుబ్బాక ‘కారు’ లో కంగారు ! హరీష్ రావు పైనే భారం ?  

-

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు దుబ్బాక ఉప ఎన్నికలు కత్తి మీద సాములా మారాయి. ఇక్కడ ఉప ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో, అన్ని పార్టీలు అక్కడ పూర్తిస్థాయిలో దృష్టి సారించాయి. తెలంగాణలో వరుస విజయాలతో దూసుకొస్తున్న టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాకలో మాత్రం పరిస్థితి అనుకూలంగా లేదనే సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది రెఫరెండం అని అన్ని పార్టీలు భావిస్తుండటంతో గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. దుబ్బాకలో టిఆర్ఎస్ నుంచి గెలుపొందిన సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదే స్థానం నుంచి రామలింగారెడ్డి భార్యను బరిలోకి దించాలని టిఆర్ఎస్ భావిస్తుండగా, ఆమె కుమారుడు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీ నుంచి రఘునందన్ రావు అభ్యర్థిత్వం ఖరారైనా కాంగ్రెస్ లో ఇంకా క్లారిటి రాలేదు.ఇప్పటికే ఇక్కడ బిజెపి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉంది. అదీ కాకుండా, కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండటం కూడా కలిసొచ్చేలా కనిపిస్తోంది. దీనికితోడు వరుసగా ఓటమి చెందుతూ వస్తున్న రఘునందన్ రావుపై ప్రజల్లో సెంటిమెంటు ఉండటం, ఆయన ఓటమి చెందినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఉండడం, ఇలా ఎన్నో అంశాలు బీజేపీకి కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి.

ఇక కాంగ్రెస్ నుంచి పోటీ అంతంత మాత్రంగానే ఉన్నా, ఇప్పుడు సొంత పార్టీలో గ్రూపు రాజకీయాలు టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి. టిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం కూడా టిఆర్ఎస్ కు ఆందోళన కలిగిస్తోంది. ఆయన టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వని పక్షంలో పార్టీ అభ్యర్థికి సహకరిస్తారా లేదా అనే అనుమానాలు ఇప్పుడు టిఆర్ఎస్ నేతల్లో ఉన్నాయి. అదీ కాకుండా, ఆయన లోపాయికారిగా బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కు సహకరించేలా ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం టిఆర్ఎస్ నేతలను కలవరానికి గురిచేస్తోంది.

ఇలా అనేక అంశాలు టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారడంతో , ట్రబుల్ షూటర్ గా హరీష్ రావు ను టీఆర్ఎస్ రంగంలోకి దించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. సిద్దిపేట జిల్లాలో గట్టిపట్టు ఉన్న హరీష్ రావు అన్ని వర్గాల వారికి సన్నిహితుడుగా ఉండడం, గట్టి నెట్వర్క్ ఉండడం, తమకు కలిసొస్తాయని టిఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఒకవేళ ఇక్కడ నుంచి  టిఆర్ఎస్ అభ్యర్థి గెలవకపోతే, బిజెపికి ఆ ఛాన్స్ ఉందని, ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుందనే భయం టిఆర్ఎస్ ను  వెంటాడుతోంది. అందుకే  ఇక్కడ ఈ స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. కేసీఆర్ నమ్మకాన్ని హరీష్ ఎంతవరకు నిలబెడతాడో ?

-Surya

Read more RELATED
Recommended to you

Latest news