వైసిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. తాను ఏ ఒక్క ఎమ్మెల్యేను, ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోనని.. మీతో పని చేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలు చేయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ అడుగులన్నీ కూడా దాని కోసమేనని.. కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు సీఎం జగన్.
ప్రతి నియోజకవర్గంలో లక్షల మంది మనపై ఆధారపడి ఉన్నారని.. ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు రెండింటికి నష్టం జరుగుతుందన్నారు. మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారని.. అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలి ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలని.. అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమం జరిగితే కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుందన్నారు. నేను చేయాల్సింది.. నేను చేయాలి.. మీరు చేయాల్సిది మీరు చేయాలని అన్నారు.