భద్రాచలం వరద ముంపునకు గురైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం నెలకొంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్లే భద్రాచలం వరద ముంపునకు గురి అయిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై ఇప్పటికే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు పువ్వాడ వ్యాఖ్యలను తప్పు పడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వివాదంపై స్పందించారు ఏపీ మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని.
భద్రాద్రి పై తెలంగాణ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అని ఆయన ఆరోపించారు. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా భద్రాద్రి ఆలయానికి నిధులు కేటాయించి ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు భద్రాద్రి పై ప్రేమ లేకుంటే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేయండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాద్రి ముంపునకు గురి అయింది అనడం హాస్యాస్పదం అని పేర్నినాని పేర్కొన్నారు.