ఆ ఒక్క టీడీపీ ఎమ్మెల్యే జ‌గ‌న్‌కు లొంగడం కష్టమేనా..?

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖ వేదికగానే రాజకీయం నడుపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా విశాఖ నగరంలో పాగా వేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. నగరంలో టీడీపీ బలంగా ఉండటంతో, ఆ పార్టీని వీక్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నట్లు ప్రకటించి, సంచలనం సృష్టించారు.

పైగా చంద్రబాబు అమరావతికి సపోర్ట్ చేయడంతో, విశాఖలో టీడీపీ నేతల రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఇటు అధికార వైసీపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపడంతో, విశాఖ తమ్ముళ్ళు, జగన్‌కు జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోయారు. తాజాగా విశాఖ నగరంలోని సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ జగన్‌కు సపోర్ట్ ఇచ్చారు. పదవికి రాజీనామా చేయకుండా వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు.

ఇక మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రేపోమాపో టీడీపీని వీడటం ఖాయమని తెలుస్తోంది. అలాగే వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు సైతం టీడీపీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. గణబాబుపైన కూడా టీడీపీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం జరిగితే ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మాత్రం, చంద్రబాబుకు సపోర్ట్‌గానే ఉంటారని తెలుస్తోంది.

బాబుకు వీర విధేయుడుగా ఉన్న వెలగపూడి ఈస్ట్ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ విశాఖని రాజధానిగా ప్రకటించినా, వెలగపూడి మాత్రం అమరావతికే మద్ధతు ఇచ్చారు. దీంతో పలువురు వైసీపీ శ్రేణులు వెలగపూడిని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నాయి. అయినా సరే వెలగపూడి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెలగపూడి మాత్రం టీడీపీని వీడే ప్రసక్తి లేదని తెలుస్తోంది. కాబట్టి విశాఖలో టీడీపీ తరుపున వెలగపూడి ఒక్కరే నిలబడే అవకాశాలున్నాయి.

-vuyyuru subhash