పోలవరంలో డయాఫ్రం వాల్ ఎంత దెబ్బతిన్నదనే విషయంపై నివేదిక వచ్చే వరకు ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు జరగడానికి అవకాశం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే పనులు కుంటుపడ్డాయని తెలిపారు. ‘‘కాఫర్ డ్యాం కంటే డయాఫ్రం వాల్ కట్టడం ముమ్మాటికీ తప్పే. ఈ విషయంపై అవసరమైతే పీపీఏ, సీడబ్ల్యూసీ, కేంద్రాన్ని అడుగుతాం. పోలవరంపై ఇతర రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఏదో జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తు్న్నారు’’ అని అంబటి రాంబాబు అన్నారు.
‘‘డయాఫ్రం వాల్ దెబ్బతిందనేది మా అభిప్రాయం. దీన్ని ఏ సంస్థా ధ్రువీకరించలేదు. ఈ విషయాన్ని చెప్పే సంస్థలు ప్రపంచంలో ఎక్కడా లేవు. డయాఫ్రం వాల్ ఎంత మేర దెబ్బతిందనే అంశంపై నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ద్వారా అధ్యయనం జరుగుతోంది. అధ్యయనం తర్వాతే డయాఫ్రం వాల్ దెబ్బతిందా? లేదా? అనేది తేలుతుంది. ఆ నివేదిక వచ్చే వరకు రాక్‌ఫిల్ డ్యామ్ పనులు జరగవు. దెబ్బతిందని నిర్ధారణకు వచ్చిన తర్వాతే దాన్ని రిపేర్ చేయాలా?కొత్త డయాఫ్రం వాల్ కట్టాలా?అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్లారిటీ వచ్చే వరకు పోలవరంలో ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు జరిగేందుకు అవకాశం లేదు.’’ అని మంత్రి అన్నారు.