కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ జగరోనా వైరస్ అని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. నిన్న మంగళగిరి నియోజకవర్గం, ఆత్మకూరు గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… వైసీపీ పాలనలో ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ చార్జీలు పెంచడం వలన ఇల్లు గడవడం కష్టమవుతోందని మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేసారని… పైగా అడ్డమైన కారణాలు చెప్పి సంక్షేమ పథకాలు కట్ చేసారని అన్నారని ఫైర్ అయ్యారు.
పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి, చంద్రబాబు గారి ప్రభుత్వం రావాలని వారికి చెప్పాను. కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన వైరస్ జగరోనా వైరస్ అని… అది రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తోందని ప్రజలకు వివరించానని… మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్న జగన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడని… విషపూరితమైన మద్యాన్ని అమ్ముతూ ప్రజల్ని బలితీసుకుంటున్నాడని ప్రజలకు జగన్ రెడ్డి మోసాన్ని వారి ముందుంచానని వివరించారు.
ఉచితంగా దొరికే ఇసుకను బంగారం చేసిన జగన్ రెడ్డి ఎంతో మందికి ఉపాధి లేకుండా చేశారు. ఇటు ప్రజలు పని దొరక్క కష్టాలు పడుతుంటే… ఇసుక అక్రమంగా రాష్ట్రం దాటి బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్తోంది. అలా దోచుకున్న వందల కోట్ల డబ్బు జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తోంది. రాష్ట్రంలో రోడ్ల పై ప్రజలు పడుతున్న బాధలు తలుచుకుంటేనే బాధేస్తుంది. అప్పుడప్పుడూ సమీక్షా సమావేశాలు పెట్టడం రోడ్లు బాగుచేయాలని ఆదేశిలిచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం తప్ప ఒక్క చోట కూడా కొత్తగా రోడ్డు వెయ్యడం లేదని ఫైర్ అయ్యారు లోకేష్.