బాబు అంటే లెక్కలేదు…కానీ పవన్ ఎఫెక్ట్ జగన్‌పై ఉందా..?

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఈయనకు ఓట్లు అయితే పడలేదు గానీ, జనంలోకి వెళితే మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ కనిపిస్తోంది. పవన్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ జనం గుమిగూడతారు. ఈయన ఏదైనా డిమాండ్ చేస్తూ, పోరాటానికి పిలుపునిస్తే, ఆ డిమాండ్‌ని ప్రభుత్వాలు త్వరగానే అమలు చేస్తాయి. గతంలో అధికారంలో చంద్రబాబు, పవన్ ప్రభావంతో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి విషయమైన, శ్రీకాకుళం ఉద్దానం సమస్యలపై పవన్ పోరాటం చేస్తే, బాబు వెనక్కి తగ్గడం చేశారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ డిమాండ్లని బాబు అసలు పట్టించుకోలేదు. కానీ పవన్ ఏదైనా డిమాండ్ చేస్తే, దాన్ని అమలు చేయడానికే చూశారు.

పవన్ మళ్ళీ జనంలోకి వెళితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే బాబు అలా చేశారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ కూడా అదే రూట్‌లో వెళుతున్నట్లు కనిపిస్తోంది. జగన్…బాబు మాట అసలు లెక్క చేయడం లేదన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసినా, డిమాండ్లు చేసినా జగన్ అసలు పట్టించుకోరు. కానీ పవన్ ఏమన్నా డిమాండ్ చేస్తే ప్రభుత్వంలో కాస్త కదలిక కనిపించేది. గతంలో ఇసుక విషయంలో పవన్ భారీ ర్యాలీ తీస్తే, దానిపై వెంటనే ప్రభుత్వం స్పందించింది.

అలాగే పలు సమస్యల విషయంలో పవన్ రంగంలోకి దిగితే, ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గేది. తాజాగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధమైన విషయం తెలిసిందే. దీనిపై సి‌బి‌ఐ విచారణ జరపాలని, నిజనిజాలని తేల్చాలని ప్రతిపక్ష టీడీపీ నేతలు తెగ డిమాండ్ చేశారు. కానీ వారి మాటలని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఏవేవో సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారుగానీ, సి‌బి‌ఐ విచారణ వేస్తామని మాత్రం చెప్పలేదు.

అయితే పవన్ ఈ విషయంలో రంగంలోకి దిగి, ఛలో అంతర్వేది కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి కంటే ముందే సి‌బి‌ఐ విచారణకు ఆదేశించింది. ఇక పవన్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఆ కార్యక్రమాన్ని స్వాగతించారు. ఎంతైనా పవన్ ప్రభావం జగన్‌పై గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news