పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి ఎవరు అభ్యర్థిగా పోటీ చేసినా, అక్కడ జనసేన గెలవాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పుడు ఏ ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పని చేస్తున్నాయో.. అంతకుమించిన ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలపై తర్జనభర్జనలు సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ కనకరాజు సూరి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు), పార్టీ మరో నేత చెనమల్ల చంద్రశేఖర్‌లతో ముందుగా పవన్ విడిగా సమావేశమై భీమవరంలో తాజా పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. తరువాత పవన్ కల్యాణ్ భీమవరం నియోజకవర్గ నాయకులందరితో భేటీ అయ్యారు. భీమవరం తన సొంత నియోజకవర్గమని అన్న పవన్ కల్యాణ్.. పార్టీ గెలుపునకు క్యాడర్ అంతా సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.