రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి అనుభవం లేకపోయినాప్పటికీ, వంద మంది చిల్లర సలహాదారులను పెట్టుకొని, విజయకుమార్ వంటి న్యాయ మాంత్రికుని కలిశారని మీడియా కోడై కోస్తున్న తరుణంలో జగన్ మోహన్ రెడ్డి గారు కాపురం… కొత్త కాపురం అని పాట పాడడం సమంజసమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.
కాపురం… కొత్త కాపురం, ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం అని సినిమాలో పూరి గుడిసె వేసుకున్న హీరో కృష్ణ, హీరోయిన్ భారతి పాడుకుంటే, జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి దంపతులు బెంగుళూరు, హైదరాబాదు, ఇడుపులపాయ, తాడేపల్లి లలో ప్యాలెస్ లు నిర్మించుకొని పాట పాడుకున్నారెమో అని అన్నారు. విశాఖపట్నంలో మరొక కోట నిర్మించుకొని సెప్టెంబర్ లో అదే పాట పాడుకుంటారెమోనని అన్నారు. కొత్త కోటలో కాపురం పెట్టబోయే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు చిరు సిగ్గుతో ప్రజలకు తెలియజేయడం అద్వితీయమని, జగన్ మోహన్ రెడ్డి గారి ప్రకటనతో, విశాఖ ప్రజల ముఖాలలో ఆనందం ఆవిరయ్యిందని అన్నారు. ఇడుపులపాయలో జగన్ మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకున్నారని, ఇడుపులపాయ ఏమైనా రాష్ట్ర రాజధాని అయ్యిందా? అని ప్రశ్నించారు.