అంగన్వాడీలు సమస్యలు తీర్చండని కోరారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో ప్రజలు ఆటాడుకుంటున్నారని, ఈ ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పసిపిల్లలను, బాలింతల బాగోగులను చూసుకునే అంగన్వాడీలకు ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని కోరుతున్నారని గుర్తు చేశారు.
పక్క రాష్ట్రాలలో అంగన్వాడీలకు ఇస్తున్నట్లుగా జీతాలను ఇవ్వమని కోరుతున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి గౌరవ వేతనంతో పని చేస్తున్నట్లుగానే, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెబుతున్న వాలంటీర్లు, తమ వేతనాన్ని పెంచాలని ఇప్పుడు కోరుతున్నారని, సేవా రత్న, సేవా వజ్ర వంటి అవార్డులు తమకు సరిపోవని, ప్రస్తుతం ఇస్తున్న జీతానికి అదనంగా మూడున్నర రెట్లు అధిక మొత్తం జీతాన్ని పెంచాలని సమ్మె చేస్తామని అంటున్నారని తెలిపారు. వాలంటీర్లకు విధులు లేవని, సమ్మె ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదని, ఈ ఒకటవ తేదీన పింఛన్ లబ్ధిదారులకు ఇవ్వడానికి డబ్బులు లేక, ప్రభుత్వ పెద్దలే వారి చేత సమ్మె చేయిస్తున్నారేమోనని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.