1,80,715 ఇళ్ళు కేంద్రం మంజూరు చేస్తే…ఏపీ ప్రభుత్వం కట్టింది 2,167 !

-

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద దేశంలోనే అతి తక్కువ గృహ నిర్మాణాలను చేపట్టిన ఘనత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి 1,80,715 ఇళ్ళు మంజూరయితే, కేవలం 2, 167 ఇళ్ళను మాత్రమే నిర్మించారని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి 1,80,000 ఆర్థిక సహాయాన్ని చేస్తుందని, అయినా దేశంలోనే అతి తక్కువ ఇళ్ళ నిర్మాణం చేపట్టిన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందన్నారు.

ఈశాన్య రాష్ట్రాల కంటే అద్వాన పరిస్థితుల్లో ఇళ్ళ నిర్మాణంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి వైఫల్యానికి ఇదొక నిదర్శనమని, మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఆర్ 5 జోన్ లో 50,790 ఇండ్ల నిర్మాణాన్ని మాత్రం ఆగమేఘాల మీద చేపడతామని జమోరె గారు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అమరావతి పరిధిలోని ఇళ్ళను శరవేగంగా నిర్మిస్తే, ఇళ్ళ స్థలాల లబ్ధిదారులు ఊరుకుంటారా?, పాదరక్షలు పుచ్చుకొని కొట్టరా?? అని అన్నారు. రాష్ట్రంలో 32,50,000 మందికి ఇళ్ళ స్థలాలను కేటాయించారని, ఇళ్ళు మీరు కట్టుకుంటారా?, మమ్మల్ని కట్టించమంటారా?? అని ప్రభుత్వ పెద్దలు లబ్ధిదారులను ప్రశ్నించారని, ప్రభుత్వమే తమకు ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని లబ్ధిదారులు కోరగా, ఇళ్ళ నిర్మాణాన్ని చేయించి ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇళ్ళు కట్టుకుంటారా?, ఇంటి స్థలం పట్టాను క్యాన్సిల్ చేయమంటారా?? అని బెదిరిస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version