సీఎం జగన్… క్రిస్టియన్ అయితే రెడ్డి కాలేరని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.జగన్ మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతాన్ని విశ్వసిస్తే రెడ్డి కాలేరన్నది టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారి అభిప్రాయం అయి ఉంటుందని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. నిజమైన క్రైస్తవులు కులం పేరు పెట్టుకోరని, జగన్ మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయితే రెడ్డి కాకూడదని, ఆయన రెడ్డి అయితే, క్రైస్తవ మత విశ్వాసాలపై ఆయనకు నమ్మకం లేనట్టేనని, క్రైస్తవ మతంలో వర్ణ విభేదాలకు తావు లేదని అన్నారు.
తమ పార్టీ నాయకులకు రంగుల పిచ్చి ముదిరిందని, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇండ్లకు రంగులు వేసిన తమ ప్రభుత్వం, హద్దు రాళ్లకు, మూత్ర శాలలకు, ఆస్తి పత్రాలు, నోటు పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటోలను ముద్రించిందని, గతంలో దుర్గ గుడి ఉత్సవాలలో తమ పార్టీ రంగులను పోలిన లైటింగ్ ఏర్పాటు చేశారని, అయినా హిందువులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, దానిపై నిరసన తెలియజేయలేదని, కానీ మసీదు ఎంట్రన్స్ లలో ఫ్లెక్సీలు, మినార్లకు తమ పార్టీ రంగులు కలిగిన బుడుగలను ఏర్పాటు చేస్తే ముస్లిం మత పెద్దలు నిరసన తెలియజేశారని అన్నారు. దీనిపై పార్టీ తరపున క్షమాపణలను చెప్పాలని ముస్లిం పెద్దలు డిమాండ్ చేశారని, అయితే తమ పార్టీ నాయకత్వానికి క్షమాపణలు చెప్పే అలవాటు లేనందున, ఆ పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా, ఇప్పటి వరకు ఉంచుకోబడిన సభ్యుడిగా ముస్లిం మతంపై తనకున్న గౌరవంతో శిరసు వంచి తమ పార్టీ పక్షాన ముస్లిం సమాజానికి రఘురామకృష్ణ రాజు గారు క్షమాపణలు చెప్పారు.