గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అనేవారని, ఆ దిశగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారని ఫైర్ అయ్యారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పైశాచికత్వం, అరాచకాలను ఆపాలని, రాష్ట్రంలో ఒక ఎంపీని ఎత్తుకు వెళ్లి ఆస్తులు రాయించుకున్నారని, ఆస్తులు రాయించుకున్నది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కాకపోవచ్చునని రఘురామకృష్ణ రాజు అన్నారు. తనను ఎత్తుకెళ్లి లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారని, ఇప్పుడేమో ఈనాడు దినపత్రికల అధినేత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు గారిని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మార్గదర్శి సంస్థ, ఆ సంస్థ చందాదారుల గురించి సీఐడీ చీఫ్ సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, మార్గదర్శిపై ఎవరు ఫిర్యాదు చేయలేదు కదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆడపిల్ల తనపై అత్యాచారం జరిగిన తరువాత ఫిర్యాదు చేయకపోతే మేము మా బాధ్యతలను విస్మరిస్తామా? అని సంజయ్ గారు ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. మార్గదర్శి సంస్థలో ప్రముఖ రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చందాదారులుగా ఉన్నారని ప్రస్తావించగా… పిల్లలకు చాక్లెట్ ఇచ్చి ఎత్తుకెళ్లే బ్యాచ్ తో ఓ ప్రతిష్టాత్మక సంస్థను పోల్చడం దారుణమని మండిపడ్డారు. విచారణ అధికారిగా సంజయ్ గారు పత్రికా, మీడియా ప్రతినిధుల సమావేశాలను నిర్వహించి తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.