త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడేది ప్రజా ప్రభుత్వమేనని, తెలుగుదేశం, జనసేన పార్టీలో మధ్య కచ్చితంగా పొత్తు ఉంటుందని, మూడవ పార్టీతో కూడా పొత్తు ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమేనని, అయితే మూడవ పార్టీతోను పొత్తు ఉండాలనేది అందరి అభిమతమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజా నాయకుడని, ఒక కులానికి ఆయన నాయకుడు కాదని, తాను ఈ విషయాన్ని అనేకమార్లు చెప్పుకొచ్చానని, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉందని చెబుతూనే, పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గా చూడలేని వారు, ఒక కుల నాయకుడిగా చూసేవారు తమకు అవసరం లేదని ఆయనే చెప్పారని వివరించారు.
ఒక కులానికి, మతానికి ప్రాతినిధ్యం వహించేవారు మహా అంటే ఒక్కసారి నాయకుడు అవుతారేమో కానీ జీవిత కాలం నాయకుడు కాలేరని అన్నారు. రాజకీయాల్లోకి సేవా భావంతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని జగన్ మోహన్ రెడ్డి గారు వేసే చిల్లర మెతుకులకు ఆశపడే వ్యక్తులు సంకుచిత స్వభావంతో పవన్ కళ్యాణ్ గారిని అప్రతిష్ట పాలు చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాసే అవుతుందని విమర్శించారు. ఏ కులాన్నయితే అడ్డుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిపై రాజకీయం చేయాలని కొందరు అనుకుంటున్నారో ఆ ప్రజలే రేపు వారిని చెప్పులు, రాళ్ల తో కొట్టడం ఖాయమని, ఒకటి రెండు చానల్స్ ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటూ తప్పుడు ప్రచారాన్ని చేసేవారను, ముఖ్యమంత్రి పదవి విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పష్టతను ఇచ్చాక వారు వణి కి పోతున్నారని అన్నారు.