దేశమంతా రామమయం.. ఏపీలో దొంగలమయం : బీజేపీ నేత భాను ప్రకాశ్

-

దేశమంతా రామ మయం అయిపోతే.. ఆంధ్రప్రదేశ్ అంతా దొంగలమయం అయిపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ ఎద్దేవా చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ పన్నాగాలు పన్నుతోందని విమర్శించారు. నకిలీ ఎపిక్స్ కార్డులపై రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అక్రమాల బాగోతంలో అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం.. దీని వెనుక ఉన్న పెద్దలను కూడా శిక్షించాలని కోరారు.

నకిలీ ఎపిక్స్ కార్డులపై నిజాయితీగా దర్యాప్తు చేపడితే.. అప్పటి ఎన్నికల్లో ఎన్నికైన అధికార పార్టీ నేతలు తమ పదవికి అనర్హులవుతారని అన్నారు. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లనే నమ్ముకుని వైసీపీ ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నట్లు అర్థమవుతోందని చెప్పారు. తిరుపతి లో 34 వేలకు పైగా ఎపిక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవడం వైసీపీ అక్రమాలను తేటతెల్లం చేస్తున్నదని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫిర్యాదుతోనే బట్టబయలైందన్నారు. ఈ కేసును పోలీసులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామని, నిష్పక్షపాతంగా విచారించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఏపీలో ఐపీసీ సెక్షన్లు పని చేయడం లేదు.. వైసీపీ సెక్షన్లు పని చేస్తున్నాయని సెటైర్ వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version