తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ ను తీర్చి దిద్దేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలతో పాటు, దుబ్బాక ఉప ఎన్నికలపై రేవంత్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. పాదయాత్ర చేపట్టి పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాగే కెసిఆర్, కేటీఆర్ వ్యవహారాలపైన వ్యక్తిగతంగానూ పోరాడుతూ, వారి ఇమేజ్ ను ప్రజలు డ్యామేజ్ చేసే విధంగా ప్రయత్నిస్తూ, కాంగ్రెస్ కు మళ్ళీ పునర్వైభవం తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు త్వరలోనే పిసిసి అధ్యక్ష పదవి భర్తీ చేసే విషయంపైనా అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టడంతో పాటు అధిష్టానం పెద్దల దృష్టిలో పడేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే మిగతా కాంగ్రెస్ నాయకులతో పోల్చుకుంటే, గట్టిగానే పార్టీకోసం కష్ట పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. రేవంత్ దూకుడు చర్యలతో పార్టీలో కాస్త ఉత్సాహం వచ్చినట్టుగానే కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతలు అన్నీ సక్రమంగానే నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే రేవంత్ తపనను సొంత పార్టీ నేతలే అర్థం చేసుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో, పార్టీ నేతలంతా గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి, పార్టీ కోసం ప్రయత్నాలు చేయాల్సి ఉన్నా, ఆ విధంగా ఎవరు ప్రయత్నించకపోగా, ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ, కొట్టుకునేందుకు సిద్ధమవుతూ, అల్లరి చేస్తూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు.
తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి వ్యవహరించాల్సిన తీరుపై కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించగా, ఆ సమావేశంలో సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, నిరంజన్ ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకోవడంతో పాటు, కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లడంతో, ఒక్కసారిగా మళ్లీ కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. ఇటువంటి వ్యవహారాలు కాంగ్రెస్ కు మరింత చేటు తెచ్చేవే. ముఖ్యంగా బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు ఇది బాగా కలిసి వస్తోంది.
పార్టీ కోసం రేవంత్ ఎంత కష్టపడుతున్నా, మిగతా నాయకుల తీరు కారణంగా ఆ శ్రమంతా వృథా అవుతున్నట్లు కనిపిస్తోంది అని రేవంత్ సన్నిహితులు వాపోతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం కలుగజేసుకొని పార్టీలోని గ్రూపు రాజకీయాలకు పులిస్టాప్ పెట్టే విధంగా, పార్టీ కీలక నాయకులతో సమావేశం నిర్వహిస్తే తప్ప ఆ పార్టీకి మళ్లీ పునర్వైభవం వచ్చే అవకాశమే కనిపించడంలేదు. అవకాశం కనిపించడం లేదు.
-Surya