ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణస్వీకారం

-

ఏపీ హైకోర్టులో ఏడుగురు కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన జడ్డీలతో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు. మొదటగా జస్టిస్‌ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు ప్రమాణం చేశారు.

మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి జస్టిస్‌ రవీంద్రబాబు స్వగ్రామం అద్దంకి మండలం తిమ్మాయపాలెం. 1994లో ఆయన.. జ్యుడీషియల్‌ సర్వీసులోకి వచ్చారు. 2005లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. విశాఖ అనిశా కోర్టు ప్రత్యేక న్యాయాధికారిగా పనిచేశారు. రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు ప్రాంతాల్లో న్యాయాధికారిగా సేవలు అందించారు. 2021 డిసెంబరు నుంచి ఏపీ హైకోర్టులో రిజిస్ట్రార్‌ జనరల్‌గా (ఆర్‌జీ) కొనసాగుతున్నారు.

డాక్టర్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌తోనూ గవర్నర్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. జస్టిస్‌ రాధాకృష్ణ కృపాసాగర్‌.. 1994లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులు అయ్యారు. 2005లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది న్యాయ సేవలు అందించారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

జస్టిస్‌ బండారు శ్యాంసుందర్‌తో హైకోర్టు న్యాయమూర్తిగా గవర్నర్‌ ప్రమాణం చేయించారు. జస్టిస్‌ బండారు శ్యాంసుందర్‌.. 1962లో అనంతపురంలో జన్మించారు. మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌గా 1991లో జ్యుడిషియల్‌ సర్వీసులోకి ప్రవేశించారు. తర్వాత పదోన్నతి పొంది సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, అదనపు జిల్లా జడ్జిగా న్యాయసేవలు అందించారు. విజయవాడలో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా పని చేశారు.

జస్టిస్‌ ఊటుకూరు శ్రీనివాస్‌తో హైకోర్టు న్యాయమూర్తిగా గవర్నర్‌ ప్రమాణం చేయించారు. జస్టిస్‌ ఊటుకూరు శ్రీనివాస్‌.. న్యాయాధికారిగా 1994 మేలో చిత్తూరులో మొదటి పోస్టింగ్‌ తీసుకున్నారు. గుంటూరు, విశాఖ, ఒంగోలు, హైదరాబాద్‌, కర్నూలులో న్యాయసేవలు అందించారు. కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తితో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా గవర్నర్‌ ప్రమాణం చేయించారు.

ఈయన తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో జన్మించారు. 1994లో డిస్ట్రిక్ట్‌ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌గా జ్యుడిషియల్‌ సర్వీసులో చేరారు. 2019లో విజయవాడలోని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా న్యాయసేవలందించారు. 2020 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్‌గా సేవలు అందించారు.

జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావుతోనూ గవర్నర్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో ఈయన జన్మించారు. బాపట్ల జిల్లా పర్చూరులో 1994లో అదనపు డిస్ట్రిక్ట్‌ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. ధర్మవరం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో న్యాయసేవలు అందించారు. 2006లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది మచిలీపట్నం, ఏలూరులో న్యాయసేవలు అందించారు. నూజివీడులో అదనపు జిల్లా జడ్జిగా పని చేశారు.

జస్టిస్‌ దుప్పల వెంకటరమణతో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా గవర్నర్‌ ప్రమాణం చేయించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈయన జన్మించారు. 1994లో మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌గా జ్యుడిషియల్‌ సర్వీసులో చేరారు. తితిదే న్యాయాధికారిగా 2015 నుంచి 2017 వరకు పనిచేశారు. 2017 నుంచి 2019 వరకు ఏపీ న్యాయశాఖ కార్యదర్శిగా సేవలు అందించారు. 2020 నుంచి రిజిస్ట్రార్‌గా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news