ఆంధ్రప్రదేశ్‌లో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన లో ఉన్న ఆయన శుక్రవారం అక్కడి మీడియాతో మాట్లాడారు. నైపుణ్య గణనకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మానవ వనరులే పెట్టుబడిగా సంపద సృష్టిస్తామని, స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉపాధి కల్పిస్తామని అన్నారు. పీపీపీ నమూనా స్థానంలో పీ-4 విధానం తెస్తామని పేర్కొన్నారు.
మళ్లీ జగన్ వస్తే ఎలా అని అన్ని వర్గాలూ అనుమానం వ్యక్తం చేస్తున్నాయని, ఇక డెవిల్‌ను నియంత్రించాం.. ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదని తెలిపారు. దావోస్ పెట్టబడుల సదస్సుకు తప్పక హాజరవుతానని బాబు వివరించారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రాని కి లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని, నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు. గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు ఇవ్వవచ్చని వెల్లడించారు. తాము కేంద్రం నుంచి ఎలాంటి పదవులూ ఆశించలేదని అన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ పదవులు ఆశించలేదని, ఏడు మంత్రి పదవులు తీసుకోవాలని వాజ్‌పేయీ కోరినా తీసుకోలేదని తెలిపారు.