‘తీర్థం తిరుపతి’ టూర్ ప్యాకేజీ.. తిరుపతి చుట్టూ వుండే ఆలయాలను చూసొచ్చేయచ్చు..!

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం టూర్ ప్యాకేజీలను తీసుకు వస్తూనే ఉంటుంది. తాజాగా తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులు వెంకటేశ్వరస్వామి దర్శనం తర్వాత తిరుపతి దగ్గర ఉన్న ఆలయాలను చూడడం కోసం టూర్ ప్యాకేజీలను తీసుకు వచ్చింది.

‘తీర్థం తిరుపతి’ పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఇక ఈ టూర్ ప్యాకేజీ వివరాలను చూస్తే.. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కాణిపాకం, శ్రీకాళహస్తి చూడచ్చు. అలానే తిరుపతి సమీపంలో మరి కొన్ని ఆలయాలను కూడా చూడచ్చు. ఈ టూర్ మొత్తం ఒక రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీ.

తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు ఇతర ఆలయాల సందర్శన కవర్ అవుతుంది. ‘తీర్థం తిరుపతి’ ప్యాకేజీ మొదటి రోజు తిరుపతి రైల్వే స్టేషన్‌లో ప్రారంభం అవుతుంది. అక్కడ నుండి నారాయణవణానికి బయల్దేరాలి. ఆ తర్వాత అప్పలయ్యగుంటకు భక్తుల్ని తీసుకెళ్తారు. అక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన ఉంటుంది. నెక్స్ట్ శ్రీనివాస మంగాపురం, కపిల తీర్థం చూసేసి… రాత్రికి తిరుపతిలో స్టే చేయాలి.

రెండవ రోజు హోటల్ నుంచి చెకౌట్ అయిన తర్వాత తిరుమల ఆలయానికి వెళ్ళచ్చు. తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. దర్శనం పూర్తైన తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి ఆలయం కి వెళ్ళచ్చు. రెండో రోజు రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది.

ఇక ఈ ప్యాకేజీ వివరాలను చూస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,740, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,470, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12,410 చెల్లించాలి. అదే ఒకవేళ నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేస్తే.. అప్పుడు డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4,710, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,570 చెల్లించాలి. అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో పూర్తి వివరాలను చూడచ్చు.