రాజకీయాల్లో పంతాలు.. పట్టుదలలు ఎంత ఉండాలో.. అంతే రీతిలో లౌక్యం కూడా ఉండాలని అంటారు రాజకీయ పండితులు. ఈ విషయంలో కొందరు నాలుగాకులు ఎక్కువే చదువుతారు. అయితే, కొందరు లౌక్యాన్ని పక్కన పెట్టి ముందుకు సాగుతారు. కానీ, ఇలాంటి వారు ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగిన సందర్భాలు మనకు కనిపించవు. గతంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీడీపీ వ్యవస్థాపక అధినేత నందమూరి తారకరామారావు కూడా లౌక్యం తెలిసిన రాజకీయాలు చేయలేకపోయారనే పెద్ద విమర్శలనే ఎదుర్కొన్నారు. ఈ తరహా లౌక్యం ఆయన ప్రదర్శించకపోవడం వల్లే.. అనేక సందర్భాల్లో పార్టీ ఇబ్బందుల్లో పడిపోయింది.
నిజానికి అన్నగారు నందమూరితో పోల్చుకుంటే.. రాజకీయ లౌక్యం తెలిసిన నాయకుడిగా చంద్రబాబుకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఇక, తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు చాలా లౌక్యంగా ముందుకు సాగుతున్నారనే వాదన అప్పుడే వినిపించడం గమనార్హం నిజానికి ఆయన పగ్గాలు చేపట్టి.. ఇంకా రెండు రోజులు కూడా గడవలేదు. కానీ, కీలకమైన రాజధాని, ప్రత్యేక హోదా వంటి అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడుతూనే.. లౌక్యంగా వాటి నుంచి తప్పించుకుంటున్నారు. రాజధాని విషయంలో తమ పార్టీకి ఒక స్టాండు ఉందని అంటూనే .. గతంలో చంద్రబాబు అమరావతిని ఎంచుకుని మమ్మల్ని, మా అభిప్రాయాన్ని అడిగారా? అని ప్రశ్నించారు.
అంతేకాదు, ఇప్పుడు జగన్ మాత్రం మమ్మల్ని అడిగాడా? అప్పట్లో మేం కాదు, ఔను అనే సలహాలు చెప్పి ఉంటే.. ఇప్పుడు కూడా మాట్లాడేందుకు స్కోప్ ఉంటుంది! అంటూ తనదైన శైలికి లౌక్యం చేర్చి ప్రశ్నించారు. ఇక, హోదా విషయాన్ని మాట్లాడుతూ.. హోదాను మించిన ప్యాకేజీ ఇస్తానంటే.. ఏ రాష్ట్రం మాత్రం వద్దంటుంది? అంటూ ప్రశ్నించారు. అంటే తద్వారా ఆయన హోదాను కాదని, ఔనని అంటూనే.. ప్యాకేజీని సమర్ధించారు. ఇది నిజంగా రాజకీయాల్లో ఉండాల్సిన ప్రధాన లౌక్యం. గత బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ తరహా లౌక్యం చేయలేక పోయారనేది నిర్వివాదాంశం.
తాను గుంటూరుకు చెందిన నాయకుడిననో.. లేక మరేదైనా ఒత్తిళ్లు ఉన్నాయో.. ఇవేవీ కాక.. తానే సీనియర్ పొలిటీషియన్ అని అనుకున్నారో.. తెలియదు కానీ, రాజధాని విషయంలో బీజేపీ కేంద్ర నాయకుల మాటలకు కన్నా మాటలకు పొంతన లేకుండా పోయింది. ఇక, హోదా విషయంలోనూ ఆయన కట్టె విరిచినట్టు మాట్లాడారు. ఈ పరిణామాల ప్రభావం.. ఆయనను పార్టీలో అధ్యక్ష పదవికి దూరం చేసిందనేది పూర్తిగా వాస్తవం. ఇప్పుడు సోము.. అన్ని పరిణామాలకు గణాంకాలు వేసుకుని.. లౌక్యంగా ముందుకు సాగుతున్న తీరు.. స్పష్టంగా ఆయనకు మంచి మార్కులు పడేలా చేస్తుందనడంలో సందేహం లేదు.