దొంగ ఐడి కార్డులు ముద్రించి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు – అచ్చెన్నాయుడు

నేడు తిరుపతికి కో -ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మూడు గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 12 మంది డైరెక్టర్లకు వైసీపీ – టీడీపీలు అభ్యర్థులను నిలబెట్టారు. అయితే టిడిపి నేతలను గృహనిర్బంధం చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి ఇక ఎన్నికలు ఎందుకు అని మండిపడ్డారు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు. నిజాయితీగా గెలిచే దమ్ము లేక వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు అని మండిపడ్డారు.

పోలీసులు ఉన్నది అధికారపక్షానికి కొమ్ముకాయడానికా? లేక ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారంటూ, వైసీపీ నేతలను ఎందుకు అరెస్టు చేయలేదని అడిగారు. దొంగ ఐడి కార్డులు ముద్రించి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గెలిచినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జగన్ రెడ్డికి ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.