బుధవారం కాకినాడ లో పర్యటించారు కేంద్రమంత్రి మురుగన్. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. కాకినాడ లోని 36వ డివిజన్ సచివాలయాన్ని ఆయన సందర్శించారు. సచివాలయ వ్యవస్థ తో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు కేంద్ర మంత్రి. అక్కడ విధుల్లో ఉన్న మహిళా పోలీస్ ఫోన్ నుంచి దిశ యాప్ పనితీరును ఆయన పరిశీలించారు.
ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే.. సెకండ్ల వ్యవధిలో దిశ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడంతో కేంద్రమంత్రే దానికి జవాబు ఇచ్చారు. దిశ యాప్ తో పాటు కంట్రోల్ రూమ్ లు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, సిబ్బందిని ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ ను, ప్రతి డివిజన్‌కు ఓ సచివాలయాన్ని ఏర్పాటు చేసిందన్నారు.వాటికి కార్యదర్శులను నియమించి వ్యవస్థను సమర్థంగా నడిపిస్తున్నారని అభినందించారు. సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల గడప దగ్గరికే చేర్చడం సంతోషంగా ఉందన్నారు.