ఓటమి తర్వాత వల్లభనేని వంశీ సంచలన ప్రకటన చేశారు. గన్నవరం నాలుగు మండలాల్లో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా గత పదేళ్ళుగా పోలవరం కుడికాల్వపై నా సొంత ఖర్చులతో 500 మోటార్లు ఏర్పాటు చేసానని వెల్లడించారు వల్లభనేని వంశీ. వీటి ద్వారానే పట్టిసీమ నీటిని పంట పొలాలకు, చెరువులకు మళ్ళించడం జరిగిందన్నారు. అదే విధంగా ఏలూరు కాల్వపై కూడా 150 మోటార్లు ఏర్పాటు చేసి చివరి ఆయుకట్టుకు సక్రమంగా నీరు చేరేలా చర్యలు తీసుకున్నానని.. ఈ కారణంగా నియోజకవర్గంలో మెట్ట డెల్టా ప్రాంత ఆయుకట్టు స్థిరీకరణ జరిగి, తాగు, సాగు చెరువులు పుష్కలంగా జలకళను సంతరించుకున్నాయని తెలిపారు వల్లభనేని వంశీ.
దాదాపు 500 మోటార్లు, ఇతర సామాగ్రి కేవలం రైతులు ఉపయోగించుకునేందుకు మాత్రమే నియోజకవర్గంలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. గతంలో మాదిరిగానే రైతులు, రైతు నాయకులు కమిటీలుగా ఏర్పడి యథావిధిగా పట్టిసీమ నీటిని పంట పొలాలు, చెరువులకు మళ్ళించేందుకు వీలుగా మోటార్లను ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నానని వివరించారు వల్లభనేని వంశీ. రెండుసార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన నేను, గత 20 సంవత్సరాల పాటు రాజకీయాలకు అతీతంగానే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాను….మోటార్లు ఉపయోగించుకునే అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా, కేవలం రైతుల ప్రయోజనాల కోసం నేను స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమంగా భావించి మోటార్లను వినియోగించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి, రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.