ముందస్తుకు వెళ్లం..ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 175 సీట్లు గెలుస్తాం : వెల్లంపల్లి

వచ్చే ఎన్నికల్లో 175 కి 175 మేమే గెలుస్తామని ప్రకటన చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమని.. 175 కి 175 మేమే గెలుస్తామననారు. ఏపీలో టీడీపీ క్యాడర్ చెల్లా చెదురైపోయిందని.. క్యాడర్ ను కాపాడుకోవడానికే ముందస్తు ఎన్నికలంటూ బాబు హడావిడి చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.

ముందస్తు ఎన్నికలొస్తాయని చంద్రబాబు ఎలా చెబుతాడని.. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదని తేల్చి చెప్పారు. 2024లో చంద్రబాబుకి అభ్యర్ధులు కూడా దొరకరని.. ముందస్తొచ్చినా… మద్యస్తొచ్చినా…ఈ రాష్ట్రంలో ఎగిరేది వైసీపీ జెండానేనని తేల్చి చెప్పారు.

చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నారని.. క్యాడర్ ను ఉత్సాహపరచడానికే పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని మభ్యపెడుతున్నారన్నారు. రాసి పెట్టుకోండి…జగన్‌ను ఓడించడం చంద్రబాబు, లోకేష్ తరం కాదని… ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డితోనే ఉన్నారని తెలిపారు. అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడని.. రాబోయే ఎన్నికల్లో అచ్చెన్నాయుడికి డిపాజిట్లు కూడా రావన్నారు.