టీడీపీ చేసిన తప్పే వైసీపీ చేస్తుందా ?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ జిల్లాలో కేడర్‌ను పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. కట్ చేస్తే ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు. మారిన రాజకీయ పరిణామాల్లో జిల్లాలో వైసీపీ పరిస్థితి కూడా టీడీపీకి తీసికట్టుగా ఏమీ లేదని అనుకుంటున్నారట సిక్కోలు నేతలు.

శ్రీకాకుళం జిల్లా నుంచి జాతీయ, రాష్ట్రా స్థాయిలో ఎదిగిన టీడీపీ నాయకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి పార్టీకి 2014లో మంచి ఊపు వచ్చినా.. 2019 ఎన్నికల్లో చేదు ఫలితాలే ఎదురయ్యాయి. సంక్షేమ పథకాలను చూసి తప్పకుండా రెండోసారి ప్రజలు ఆదిరిస్తారని భావించారు టీడీపీ నేతలు. కానీ.. జన్మభూమి కమిటీలు, నీరు-చెట్టు పనుల్లో అనేక మంది పార్టీ నేతలు చేతులు కాల్చుకున్నారని చెబుతారు. ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టీడీపీ ప్రాధాన్యం ఇవ్వడం ప్రతికూలంగా మారిందని అంతా అయ్యాక గుర్తించారు.

ఇప్పుడు ఎక్కడ పార్టీ మీటింగ్‌ పెట్టినా.. నాయకులు చెబుతున్న మాట ఒక్కటే. గతంలో చేసిన పొరపాట్లు దెబ్బతీశాయి. ఇకపై కార్యకర్తలను దేవుళ్ల మాదిరి చూసుకుంటామని హామీ ఇస్తున్నారట. కొందరు నాయకులైతే లెంపేసుకుని క్షమాపణ కోరుతున్నారట. ఇటీవల ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు మొదలు.. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల వరకు అందరూ కేడర్‌ను బుజ్జగిస్తున్నారట. పైగా ఇకపై నాయకులు ఎవరు తప్పు చేసినా నిలదీయాలని సూచిస్తున్నారట. కాకపోతే అధికారంలో ఉన్నన్నాళ్లూ కన్నూమిన్నూ కానరాని నాయకులు చేతుల కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఏం లాభమనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో జిల్లాలో ఇప్పుడు మరో చర్చ కూడా మొదలైంది. గతంలో టీడీపీ చేసిన పొరపాట్లే వైసీపీ కూడా చేస్తోందని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయట. ప్రభుత్వం వరస పెట్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా.. కార్యకర్తలు మాత్రం జనాల్లోకి వెళ్లలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారట. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత తమకు పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని వాపోతున్నారట. ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించినా పిలవడం లేదని.. లబ్ధిదారుల ఎంపికలోనూ స్థానికంగా తమకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

వైసీపీ సంస్థాగత నిర్మాణంపైనా నాయకులు దృష్టి పెట్టకపోవడంపై కేడర్‌ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. పార్లమెంట్ ఇంఛార్జ్‌గా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని నియమించి చేతులు దులిపేసుకున్నారని కామెంట్స్‌ చేస్తున్నారట. గతంలో పార్టీ ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా రెండు మూడొందల మంది కార్యకర్తలు హాజరై వైసీపీ ఆఫీసులు సందడిగా ఉండేవని.. ఇప్పుడు 20-30మంది కూడా రావడం లేదని చెబుతున్నారు. కార్యకర్తలను కాపాడుకోవాలని సందర్భం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వంటి వారు బహిరంగంగానే తమ మనసులోని మాట బయటపెడుతున్నారు. టీడీపీ మాదిరి చేస్తే వచ్చే జనరల్‌ ఎలక్షన్స్‌ వరకు ఆగక్కర్లేదని.. స్థానిక ఎన్నికల్లోనే ఇబ్బందులు ఎదురవుతాయని నాయకులు హెచ్చరిస్తున్నారు కూడా.

మొత్తానికి అటు టీడీపీ ఇటు వైసీపీల్లో నెలకొన్న పరిణామాలు.. పశ్చాత్తాపాలు, అసంతృప్తి రాగాలు సిక్కోలు రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. మరి.. వీటికి పార్టీల పెద్దలు పరిష్కారం సూచిస్తారో లేదో చూడాలి.