కొత్తరకం దందా మొదలుపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే…!

సీఎం జగన్ ఏపీలో అవినీతిని కట్టడి చేసే దిశగా పటిష్టమైన చర్యలు ఓవైపు తీసుకుంటే.. కొంత మంది ఎమ్మెల్యేలు అవినీతికి కొత్త దారులు వెతుక్కుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో నియోజకవర్గంలో ప్రజలతో సంబంధం ఉన్న ఇష్యూస్ జొలికి వెళ్తే బయటకు వచ్చేసే అవకాశం ఉండడంతో ప్రజలతో సంబంధం లేని అంశాలను టార్గెట్ చేసుకుని ఆదాయాన్నిఆర్జించడమెలా..అనే అంశంపై ఫోకస్ పెట్టారు.

అవినీతిని అరికట్టేందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ విధానం, జూడిషీయరీ ప్రివ్యూ వంటి కొత్త రకం వ్యవస్థలను తెర మీదకు తెచ్చారు జగన్. అలాగే పొలిటికల్ కరెప్షన్ అనేదే లేకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారు ఏపీ సీఎం. ముఖ్యంగా మద్యం, ఇసుక వంటి వాటిల్లోనే రాజకీయ నేతల ప్రమేయం ఎక్కువగా ఉండి అవినీతి ఎక్కువగా జరుగుతుందనేది ఏపీ సీఎం భావన. గత ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరడానికి ఈ రెండే ప్రధాన కారణాలనేది ఈ ప్రభుత్వం కూడా భావిస్తోంది. దీంతో వీటిని కట్టడి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంది ప్రస్తుత ప్రభుత్వం.

ఈ క్రమంలో ఏపీఐఐసీని కేంద్రంగా చేసుకుని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కొత్త తరం దందాకు తెర లేపినట్టు తెలుస్తోంది. తన నియోజకవర్గ పరిధిలో ఏపీపీఐసీ ఏయే సంస్థలకు భూములు కేటాయించిందో గుర్తించి.. సదురు సంస్థల నుంచి డబ్బు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారట సదురు ఎమ్మెల్యే. ఈ విధంగా కొత్త రకం దందాకు తెర లేపిన ఆ ఎమ్మెల్యేకు ఏపీఐఐసీలో కీలక పొజిషన్లో ఉన్న ఓ ఉన్నతాధికారి అండగా కూడా పుష్కలంగా ఉందట. సదురు ఉన్నతాధికారి కూడా అదే జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆ ఎమ్మెల్యేకు పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలుస్తోంది.

దీని పై ఏపీఐఐసీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ప్రతిష్టాత్మక కంపెనీకి కూడా ఇదే తరహా ఇబ్బంది ఎదురు కావడంతో ఆ సంస్థ నేరుగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ప్రభుత్వ పెద్దలు కూడా సదురు ఎమ్మెల్యే పని తీరు మీద ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త రకమైన దందాకు తెర లేపిన ఆ ఎమ్మెల్యే వ్యవహరం ఈ విధంగా ఉంటే.. ఇక ఏపీపీఐసీలో ఆ ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తున్న సదురు ఉన్నతాధికారి వ్యవహరశైలిపై ఏపీఐఐసీ వర్గాల్లో తలో రకంగా చర్చించుకుంటున్నారు.