టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లో తిరిగితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నా తమకు ఒకటేనని పేర్కొంటుంటే, మరొకవైపు ఆయన్ని ప్రజల్లో తిరగకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అభ్యర్థించడం వెనుకనున్న ఆంతర్యం ఏమిటంటూ నిలదీశారు.
సుప్రీం కోర్టులో బాబ్బాబు చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో తిరగనివ్వొద్దని అభ్యర్థిస్తున్నారంటే, ఆయన ఏమైనా ఒత్తిడికి గురవుతారని అడుగుతున్నారా? అంటూ అపహాస్యం చేశారు. ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళనివ్వొద్దని కోరడానికి కారణం భయమే కదా అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళితే… రానున్న ఎన్నికల్లో తుక్కు తుక్కుగా ఓడిపోతామని తెలిసి, ఆయన్ని ఎలాగైనా అడ్డుకోవడమే ధ్యేయంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఈ తరహా వాదనలు వినిపించారని, స్కిల్ కేసులో పూర్తి స్థాయి బెయిల్ పొందిన చంద్రబాబు నాయుడు గారు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లడం ఖాయమన్నారు.