బీసీ పాలిటిక్స్: జ‌గ‌న్ – బాబులో పైచేయి ఎవరిది..?

-

ఏపీలో బీసీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు బీసీలని ఆకర్షించే పనిలో పడ్డాయి. అందుకే వరుస పెట్టి బీసీలకు కీలక పదవులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో పలువురు బీసీలకు పదవులు దక్కాయి. ఇక తాజాగా బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల పాలక మండళ్లను ప్రకటించారు. రాష్ట్ర చ‌రిత్ర‌లోనే బీసీల‌కు ఇన్ని కార్పొరేష‌న్ల ఇవ్వ‌డం ఇదే తొలిసారి.

మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు ఛైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను జగన్ ప్రభుత్వం నియమించింది. అధికార వైసీపీ ఇలా బీసీ కార్పొరేషన్ల పేరిట పదవులు పంపకం చేస్తే, వీరికి ఏ మాత్రం తగ్గకుండా చంద్రబాబు, పార్టీలో కీలక పదవులు బీసీలకు కట్టబెట్టారు. ఊహించని విధంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడుని నియమించగా, తెలంగాణకు ఎల్ రమణని నియమించారు. ఈ ఇద్దరు బీసీలే.

ఇక పార్టీలో అత్యంత కీలకమైన పొలిట్‌బ్యూరోలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, కళావెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌లాంటి వారికి అవకాశం ఇచ్చారు. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు ఇలా పలు కీలక పదవుల్లో బీసీ నేతలకు బాబు అవకాశం ఇచ్చారు.
ఇలా రెండు పార్టీలు బీసీ కార్డు వాడుతూ, బీసీలకు పెద్ద పీఠ వేసే ప్రయత్నం చేశారు.

అయితే ఈ బీసీ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార వైసీపీదే పైచేయిలాగా కనిపిస్తోంది. ఎందుకంటే బీసీ ఓటర్ల మద్ధతు జగన్‌కే ఎక్కువ ఉంది. మామూలుగా తెలుగుదేశం బీసీల పార్టీ అంటారు. కానీ 2019 ఎన్నికల్లో ఆ పరిస్తితి తారుమారైంది. ఎన్నికల్లో ఎక్కువ శాతం బీసీలు జగన్‌కే మద్ధతు తెలిపారు. అందుకే చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఓడిపోయాక బీసీలని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి భవిష్యత్‌లో బీసీల‌ అండ ఎవరికి ఎక్కువ ఉంటుందో చూడాలి.

 

-vuyyuru subhash

Read more RELATED
Recommended to you

Latest news