వైసీపీ సర్కారు ఏర్పడి.. ఏడాదిన్నర అయింది. జగన్ తన కేబినెట్‌ను ఏర్పాటు చేసుకునే సమయంలో.. రెండున్నరేళ్లలో తన మంత్రివర్గాన్ని మార్చేది లేదని, రెండున్నరేళ్లకు ఖచ్చితంగా మంత్రులను మారుస్తానని చెప్పారు. అంటే మరో ఏడాదిలో మంత్రి వర్గం మారుతుంది. అయినప్పటికీ.. ఓ పది మంది వరకు మంత్రులను మార్చే పరిస్థితి కనిపించడం లేదు. కానీ, ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకారం.. ఒకవేళ రెండున్నరేళ్లు అంటే.. మరో ఏడాది కూడా ఆగకుండా.. ఇప్పటికిప్పుడు మంత్రి వర్గాన్ని మార్చాల్సి వస్తే.. ఓ మంత్రిని ఖచ్చితంగా మారుస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సదరు మంత్రి గారిని ఏ క్షణంలో అయినా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన సదరు నాయకుడు.. సీనియర్ రాజకీయ నేత. ప్రముఖ వ్యాపార వేత్తగా కూడా గుర్తింపు పొందారు. దీంతో జగన్ ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చారు. కీలకమైన శాఖను కూడా అప్పగించి మంత్రిని చేశారు. ఎంతో మంది సీనియర్లను కూడా కాదని ఆయనను నెత్తిన పెట్టుకున్నారు. అయితే, ఆయన ఆది నుంచి వివాదాల్లో చిక్కుకున్నారనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి.
ఆయనకు సంబంధం లేని శాఖల్లో వేలు పెడుతున్నారని, ఆయనకు సంబంధం లేని విషయాలను కూడా భుజాన వేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా కీలకమైన క్షత్రియ నియోజకవర్గాల్లోనూ ఆయన అందరినీ కలుపుకొని పోకుండా.. కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటున్నారని, ఫలింగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అంటున్నారు. పైగా ఇదే జిల్లాకు చెందిన ఓ అసమ్మతి ఎంపీ కూడా ఈ మంత్రి కారణంగానే పార్టీకి దూరమయ్యారా? అనే కోణంలో చర్చసాగుతుండడం గమనార్హం.
తన నియోజకవర్గంలో వేలు పెడుతుండడంతోనే సదరు ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఈ కారణంగానే పార్టీకి కూడా దూరమయ్యారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన వల్ల ఏం ప్రయోజనం అనే వ్యాఖ్యలు తరచుగా తెరమీదికి వస్తున్నాయి. దీంతో ఏ క్షణంలో అయినా సదరు మంత్రిగారిని రీప్లేస్ చేయొచ్చని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
-Vuyyuru Subhash