బీజేపీ దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలు, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుంది. ఇది ఏపీకి సంబంధం లేని విషయం. ఏదైనా ఉంటే.. బీజేపీ నేతలు క్లయిమ్ చేసుకోవాలి. కానీ, వైసీపీలో అంతర్మథనం ప్రారంభమైంది. బీజేపీ పుంజుకొంటోందా? ఇది ఏపీలో వైసీపీకి కూడా శత్రువుగా మారుతుందా? అనే చర్చ వైసీపీలో ప్రారంభమైంది. దీనికి కారణం ఏంటి? అంటే.. తెలంగాణలో ఉప ఎన్నిక జరిగిన దుబ్బాకలో గత ఎన్నికల్లో బీజేపీ అసలు రెండో స్థానంలో కూడా లేదు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంది. ఇక, బిహార్‌లో గత 2015 ఎన్నికల్లో కేవలం 40 స్థానాల్లో ఉన్న బీజేపీ ఇప్పుడు 78 స్థానాలకు ఎగబాకింది.
ఇలా దేశవ్యాప్తంగా బీజేపీ గాలులు వీస్తున్నాయి. ఇదే పరిస్థితి ఏపీలోనూ ఉంటుందా? పైగా జనసేనతో బీజేపీ చెలిమి చేస్తున్న నేపథ్యంలో 2014నాటి ఫలితం పునరావృతం అవుతుందా? అనేది వైసీపీలో అంతర్మథనంగా ఉంది. దీనిపై ఓ మంత్రి నేరుగా కామెంట్లు చేయలేదు కానీ.. నర్మగర్భంగా మాత్రం వ్యాఖ్యలు చేశారు. పుంజుకునే విషయంలో ఏ పార్టీ అయినా.. ఒకటే.. ప్రజల ఇష్టాఇష్టాలను ఎవరు మాత్రం అంచనా వేస్తాం! అనేశారు. అంటే.. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పుంజుకున్నా పుంజుకునే అవకాశం ఉందని ఆయన చెప్పకనే చెప్పేశారు.
ఇక, బీజేపీ విషయానికివస్తే.. జనసేనతో పొత్తుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. జనసేన బలం, బీజేపీ బలం కలిస్తే.. కీలకమైన తూర్పు, పశ్చిమ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం వంటి జిల్లాలపై ప్రభావం చూపించొచ్చనేది వైసీపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. అంతేకాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వీరికి అనుకూలంగా పడితే.. ఇది తమకు ఇబ్బందేనని అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ పుంజుకునే అవకాశం ఉండే ఉంటుందని వైసీపీ నాయకులు గుసగుసలాడుతుండడం గమనార్హం.
రేపు ఒకవేళ పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా ఉన్న క్రమంలో యువత ఓట్లు కూడా అటు మళ్లే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. చంద్రబాబు చేరువైనా.. ఆశ్చర్యం లేదని.. ఈ నేపథ్యంలో బిహార్ తరహాలో బీజేపీ ప్రయోగం చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి బిహార్ ఎన్నికలు.. వైసీపీలో అంతర్మథనానికి దారితీయడం చర్చనీయాంశంగా మారింది.