ఇవాళ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందారు.ఆయన మృతికి నివాళులు ఇస్తూ, ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ రెండు తెలుగు రాష్ట్రాల నాయకులూ స్పందిస్తున్నారు.అంజలి ఘటిస్తున్నారు.ఆయనకు సద్గతులు ప్రాప్తించాలని ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యావంతులు అయిన గౌతం రెడ్డికి సంబంధించి నివాళి అర్పిస్తూ రాస్తున్నకథనం ఇది.
బాగా చదువుకున్న నేపథ్యమే కాదు సంపన్న కుటుంబానికి చెందిన నేతగా ఆయనకు నెల్లూరులో ఎంతో పేరుంది. ముఖ్యంగా మంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో! ఆయన ఎక్కడా మాట తప్పరు. అదేవిధంగా మాట తూలరు. మన మంత్రులు మాదిరిగా నోటికి వచ్చిందంతా వాగరు.ఇవన్నీ నెల్లూరు మంత్రి అనీల్ ఆయనను చూసి నేర్చుకోవాల్సిందే. శ్రీకాకుళం మంత్రి సీదిరి అప్పల్రాజు ఆయనను చూసి నేర్చుకోవాల్సిందే.
ఇంకా విజయవాడకు చెందిన కొడాలి నాని లాంటి ప్రముఖులు కూడా ఆయన్ను చూసి నేర్చుకోవాల్సిందే. పార్టీలో కూడా తనదైన శైలిలో ఆయన పనిచేసేవారు. అధిష్టానంతో సంబంధాలు మెరుగైన రీతిలో ఉన్నా కూడా కొన్నినిర్ణయాలు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నాక ఇక తనకెందుకు వచ్చిన తలనొప్పి అని వదిలేసేవారు.విధేయతకు సంకేతంగా ఆయన ఉండేవారు.
ముఖ్యంగా ఆయన మితాహారం తినేవారు.మితభాషిగా ఉండే వారు. బూతులు మాట్లాడరు.కోపం ప్రదర్శించరు.అధికారుల కాలర్ పట్టుకుని మాట్లాడిన దాఖలాలే లేవు. రౌడీ మినిస్టర్ అయితే కాదు వెరీ రోయల్ వే లోనే పాలిటిక్స్ నడిపారు.ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ చాలా ఎక్కువ. ఎటువంటి చెడు అలవాట్లూ లేని వ్యక్తి. విదేశాల్లో చదువుకున్న నేపథ్యం ఉండడంతో ఇంగ్లీషు బాగా మాట్లాడతారు. మంచి విజ్ఞానం ఉంది.
పారిశ్రామిక పాలసీల రూపకల్పనలో మాత్రం ఆయన మాట చెల్లలేదు అన్నది కూడా వాస్తవం.ఈ మాట వైసీపీ ఒప్పుకోకపోయినా ఇదే నిజం. వారికి ఇవాళ మా నివాళి. మంత్రులూ ! మీరు వారిని చూసి కాస్తయినా మీ ప్రవర్తన మార్చుకోండి అన్నదే మా విన్నపం. డియర్ సర్ వి మిస్ యూ..మీలాంటి చదువు, మీలాంటి సంస్కారం ఉన్న నేతలు రాజకీయాల్లో రాణించడం కష్టం. కానీ మీరు మాత్రం నెగ్గుకు వచ్చిన తీరు ఎంతైనా అభినందనీయం.