ఆంధ్రాలో మరో భూ కుంభకోణానికి అధికార పార్టీ తెరలేపిందని, విలువయిన భూములను వైసీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి లాక్కుంటుందని, ఇవన్నీ ప్రభుత్వ భూములేనని ఓ ఆరోపణ వినవస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి భూ కేటాయింపులు జరిగిపోయాయి అని తెలుస్తోంది. మొత్తం ఈ కుంభకోణం విలువ రెండు వందల యాభై కోట్ల రూపాయలుగా ఓ అంచనా ఉందని తెలుస్తోంది. ఇవాళ ప్రధాన మీడియాలో వెలుగు చూసిన కథనం ప్రకారం ఒక్క విశాఖలోనే 58 కోట్ల రూపాయలు విలువ చేసే రెండు ఎకరాల భూమిని తీసుకున్నారని, అదేవిధంగా కాకినాడలో 77 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని పార్టీ నిర్మాణం కోసం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంతవరకూ ఎక్కడా సొంత కార్యాలయాలు లేకుండా కాలం గడుపుతున్న వైసీపీకి ఇప్పటికిప్పుడు ప్రభుత్వ భూముల కేటాయింపు అన్నది ఓ అవసరంగానే కనిపిస్తోంది అని విపక్షం ఆరోపణలు చేస్తోంది.
వాస్తవానికి ఇప్పటిదాకా ఈ విషయమై పెద్దగా ఆధారాలు అయితే వెలుగు చూడలేదు. కానీ భూ కేటాయింపులపై వైసీపీ సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని మాత్రం తెలుస్తోంది. పార్టీ కార్యాలయాలకు సొంత గూడు అన్నది లేకపోతే ఇకపై కష్టమేనని ఓ వాదన వినిపిస్తోంది. అద్దె భవనాల్లో కాలం వెళ్లదీయడం కష్టమేనని ఓ అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే వీలున్నంత మేరకు పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది.
ఇక్కడే అసలు తగాదా ఆరంభం అయిందని తిరుపతిలాంటి ప్రాంతాలలో చంద్రగిరిలో స్వాతంత్ర్యానికి ముందు నుంచి పోలీసు శాఖ అధీనంలో ఉన్న భూమిని, అదేవిధంగా రాజమండ్రిలో కేంద్ర కారాగారానికి చెందిన భూమిని, కాకినాడలో నన్నయ్య స్టడీ సెంటర్ భూమిని పార్టీ కార్యాలయాలకు కేటాయిస్తున్నరన్న అభియోగాలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయాన దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అన్నది వైసీపీకి బాగా తెలిసిన పని అని విపక్షం అంటోంది. కొన్నిచోట్ల అయితే స్థానిక పరిపాలన సంస్థల అనుమతి మరియు ఆమోదం అన్నది గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతోందని, ఇందుకు గుంటూరు లాంటి జిల్లాలే పెద్ద ఉదాహరణ అని ప్రధాన మీడియా చెబుతోంది.