నరసాపురం వైఎస్సార్ సీపీ ఎంపీ… ఇటీవల కాలంలో సొంత పార్టీ ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేస్తున్న కనుమూరి రఘురామకృష్ణ రాజు రాజకీయాల్లో చీకటి కోణం ఉందా? ఆయన ఉద్దేశ పూర్వకంగానే పార్టీపై బురద జల్లుతున్నారా? దీని వెనుక కొన్ని శక్తులు పనిచేస్తున్నాయా? అంటే.. ఢిల్లీ రాజకీయ వర్గాలు ఔననే అంటున్నాయి. కొన్నాళ్లుగా ఢిల్లీలోనే ఉంటున్న రాజుగారు.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి ఇలా సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం అనేది స్వపక్షంలోనే విపక్షం ఉండే .. కాంగ్రెస్‌లోనూ లేదని అంటున్నారు.
కానీ, రఘువిషయంలో చూస్తే.. ఇలా ఎందుకు జరుగుతోంది? అనేది చూస్తే.. పారిశ్రామికంగా అనేక మందితో పరిచయాలు ఉన్న రఘుకు.. బీజేపీ నేతలతోనూ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో బీజేపీని బలోపేతం చేసుకునేందుకు ప్రభుత్వం రాళ్లు వేయాలని కొందరు ఎప్పటి నుంచో యోచిస్తున్నారు. వీరిలో బీజేపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు కూడా ఉన్నారు. అయితే, ఇలాంటి వారు ఎన్ని విమర్శలు చేసినా.. జగన్ కు సెగ పుట్టడం లేదని భావించిన బీజేపీ నేతలు ఓ వ్యూహం ప్రకారం ఎంపీ రఘును పరోక్షంగా ప్రోత్సహించారని అంటున్నారు.
అంటే.. పారిశ్రామిక వేత్తగా రఘురామ రాజు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వీటిని తిరిగి చెల్లించడంలో జాప్యం జరగడం. ఆయా బ్యాంకులు రాజుగారిపై కేసులు నమోదు చేయడం తెలిసిందే. పైగా వివిధ రాష్ట్రాల్లో ఆయన కొత్తగా ఇటీవల కాలంలో వ్యాపారాలు ప్రారంభించినట్టు సమాచారం. ఈ పరిణామాల నుంచి సేఫ్‌గా తనను తాను కాపాడుకునేందుకు బీజేపీ చెప్పినట్టు వింటున్నారనే వ్యాఖ్యలు రాజుగారి అనుచరుల నుంచే తాజాగా బయటకు రావడం గమనార్హం. దీంతో జగన్ ప్రబుత్వంపై ఉద్దేవ పూర్వకంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.
మరోపక్క, పార్టీలో ఉంటానని అంటూనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వెనుక `జగన్ వేస్ట్`-అనే భావన కల్పిస్తే.. బీజేపీకి పరోక్షంగా లైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారట. ఇంత వ్యూహం ఉండబట్టే.. రాజుగారు అంతగా రెచ్చిపోతున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిలో నిజమెంతో చూడాలి..!