హీరోయిన్ అంటే రెండు సీన్లు, మూడు పాటలు మాత్రమే కాదు… అవసరమైతే సినిమాని ఒంటిచేత్తో నడిపించగలదు అని నిరూపించిన నటి అనుష్క. అందం, అభినయంతోపాటు నటనలోని రాజసంతో ఎంతో మంది సినీ ప్రియుల మదిని గెలుచుకున్నారు. తొలినాళ్లలో అందాలు ఆరబోసినా… ఆ తర్వాత జేజమ్మ, దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి అద్భుతమైన పాత్రలతో కట్టిపడేశారు. కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమా అనగానే.. పేరు గుర్తొచ్చేలా మాయ చేశారు. అయితే ఈ స్వీటీ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి 17ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె జర్నీతోపాటు గతంలో తాను చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలను నెమరువేసుకుందాం…
పూరీ జగన్నాథ్ ‘సూపర్’లో నటి కోసం చూస్తున్న రోజులవి. ఆ సమయంలో ఆయన స్నేహితుడు యోగా టీచర్ అనుష్క గురించి చెప్పారు. అప్పుడు పూరీ.. అనుష్కను సంప్రదించారు. అలా ఆమె హైదరాబాద్‌కు వచ్చి తొలి అవకాశం చేజిక్కించుకున్నారు.
2005లో ఆ ఒక్క రోజే తన జీవితాన్ని ఊహించని విధంగా మార్చేసింది అని గతంలో ఓసారి అనుష్క చెప్పింది.
అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరు మార్చుకున్నారు. 23 ఏళ్ల వయసులో సినిమా సెట్లో స్వీటీ అని పిలుస్తుంటే బాగోలేదని.. తనకు తానే అనుష్క అని పేరు పెట్టుకున్నారు.
తెరపై ఎలా ఉన్నా.. తెర వెనుక మాత్రం అనుష్క చాలా పద్ధతిగా ఉంటారు. సల్వార్ కమీజ్, చీరల్లో మాత్రమే కనిపిస్తారు. అయితే డ్రెస్సింగ్ విషయంలో ఓ సారి తన తల్లి అన్న మాటలు షాక్‌కి గురి చేశాయని అనుష్క గతంలో చెప్పారు. ‘మా అమ్మ ఎప్పుడూ నేను పద్ధతిగా ఉండాలనుకుంటుంది. కానీ తను ‘బిల్లా’ చూసినప్పుడు ‘ఇంకాస్త స్టైలిష్‌గా ఉండొచ్చు కదా. సగం మోడ్రన్‌గా, సగం పద్ధతిగా ఆ డ్రెస్సులేంటి?’ అన్నప్పుడు షాకయ్యా’ అని అన్నారు.
యోగా టీచర్‌గా చేయడానికి ముందు స్వీటీ స్కూల్లో చిన్న పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఈ విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆమె హిస్టరీ, ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీలో డిగ్రీ చేశారు. బీసీఏ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత ఓ స్కూల్లో మూడో తరగతి పిల్లలకు పాఠశాలలు చెప్పారు.
యువతలో అనుష్కకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వేదికగా ఎందరో అభిమానులు అనుష్కకు తమ ప్రేమను తెలుపుతారు. ఆమె కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఓ వ్యక్తి వెంటపడ్డాడట. చాల బహుమతులు తీసుకొస్తూ ఇవ్వడానికి ప్రయత్నించేవాడు. దింతో ఆమెకు కాస్త భయమేసి కొన్నాళ్లు కాలేజీకి వెళ్లలేదు. అని ఓసారి చెప్పారు.
అనుష్క అనగానే.. అందంతోపాటు ఆమె ఎత్తు కూడా గుర్తొస్తుంది. అయితే ఈ ఎత్తు వల్ల సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అది భయపడ్డారట. కానీ టెక్నాలజీ భయం పోయిందట. కాబోయే భర్త తనకంటే పొట్టిగా ఉన్నా ఫర్వాలేదు.
ఇక అనుష్క సినిమాల విషయానికొస్తే.. చివరిసారిగా 2020లో నిశ్శబ్దంతో ప్రేక్షకులను పలకరించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇటీవల యువ హీరో నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా విడుదలైంది. ఈ సినిమాతో పాటు మరిన్ని చిత్రాలతో మనల్ని అలరిస్తూ కెరీర్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిద్దాం.