ఏపీ అసెంబ్లీ :  రోశయ్య విలక్షణమైన నేత

-

– ఆనం రామనారాయణరెడ్డి
– అసెంబ్లీలో సంతాప తీర్మానం
– పెద్దాయ‌న‌కు అంజ‌లి ఘ‌టించిన వైనం

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి ఓ విలక్షణమైన నేత అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కొనియాడారు. అసెంబ్లీలో గురువారం ఆయ‌న‌పై ప్ర‌వేశ పెట్టిన  సంతాప తీర్మానంలో ఒక‌నాటి ఆయ‌న క్యాబినెట్ స‌హ‌చ‌రుడు ఆనం మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏమ‌న్నారంటే..రోశయ్య ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసి ఇటీవల కాలం చేశారు.ఈ వార్త రెండు రాష్ట్రాల్లో ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులకు తీవ్ర‌మ‌యిన బాధ,తీర‌ని లోటు కలిగాయి.ఇవాళ ఆయన్ను మరోసారి గుర్తు చేసుకుంటున్నాం.రోశయ్యది రాజకీయ చరిత్ర పుటల్లో ఒక విలక్షణమైన అధ్యాయం. ఆయన ప్రతిపక్షంలో ఉండి అధికారపక్షంగా,అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంగా ఉంటూ అన్ని పార్టీల స‌భ్యుల‌నూ ఏ విధంగా నిలువరించేవారో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌సభలో చూశాం.ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. డాక్టర్ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఆర్థికమంత్రిగా పని చేసి వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాజకీయ జీవితంలో ఎక్కువ సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రోశయ్య నిలిచారు.

రోశయ్యలో మరొక్క విషయాన్ని గమనించాలి.ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆర్థిక పరిపుష్టి ఎలా ఉంటుందంటే.. ఆయన ఆర్థికశాస్త్రాన్ని చదవలేదు.మనిషి జీవితాన్నీ, ప్రభుత్వ విధానాలనూ చదివారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సామన్య ప్రజలకు ఎలాంటి పథకాలు అందించాలని ఆలోచన చేసేవారు.ఏనాడు కూడా ఒక్క రోజు ఓవర్‌ డ్రాప్ట్‌కు వెళ్లలేదు.నాడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు కొంత అవహేళన కూడా చేశారు.కొన్ని ఆర్థిక విధానాలు సంబంధిత నిబంధ‌న‌లు అనుకూలంగా ఉన్నాయని ఇష్టపూర్వకంగా అప్పులు చేయలేదు.నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ విధానాలను ముందుకు నడిపించారు.  రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత ఉమ్మ‌డి రాష్ట్రం ఇబ్బంది పడింది.

ఆ సమయంలో పెద్దదిక్కుగా రోశయ్య ఉంటూ సీఎంగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని సక్రమంగా నడిపించారు.రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా వరదలు ముంచెత్తాయి.శ్రీశైలం డ్యామ్‌ ఓవర్ ఫ్లో అయ్యే ప్రమాదం త‌లెత్తింది.రెండు రాత్రులు సెక్రటరేట్‌లో నిద్రపోయి అక్కడి నుంచి అధికారులను మానిటర్‌ చేసి సీనియర్‌ అధికారులను శ్రీశైలం పంపించారు.భగవంతుడే ఏపీని రక్షించాలని అధికారులు అంటే..రోశయ్య ఎంతో ఓర్పుతో వ్యవహ రించి రాష్ట్రాన్ని కాపాడారు.

ఎక్కడ ఏది మాట్లాడాలో అంతే మాట్లాడేవారు.ఆ రోజు మేం కొత్తగా సభలో అడుగుపెడితే..మీకు సమయం దొరికినప్పప్పుడు కౌన్సిల్ కు వెళ్లి రోశయ్య ప్రసంగాలు వినాలని ఆ నాటి శాస‌న స‌భ కార్య‌ద‌ర్శి మాకు సలహా ఇచ్చారు.వివిధ సంద‌ర్భాల్లో ఆయ‌న వెలువ‌రించిన మాట‌లు ఆడియో, వీడియో టేపులు భ‌ద్ర‌ప‌రిచాల్సిన బాధ్య‌త కూడా మ‌నంద‌రిపైనా ఉంది.వీటిలో అవ‌స‌రం అయినవి,స‌భా వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన‌వి ఇప్ప‌టి స‌భ్యుల‌కు అందిస్తే మేలు.

Read more RELATED
Recommended to you

Latest news