ఏపీ బీపీ : అక్క‌డికి వైసీపీ క‌న్నా ముందే బీజేపీ చేరుకుందే !

-

అస‌ని తుఫాను పీడిత ప్రాంతాల‌కు సంబంధించి అప్పుడే బీజేపీ మాట్లాడ‌డం మొద‌లు పెట్టింది. అక్క‌డ‌క్క‌డ క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌కూ ప్రాధాన్యం ఇస్తూ తుఫాను తీరం దాటిన వెంట‌నే ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం దిద్దింది. రైతుల గోడు వింటోంది. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి తీరాల్లో తుఫాను న‌ష్టం చెప్ప‌లేనంత ఉంది. ఇంకా ప్రాథ‌మిక అంచ‌నాలు కూడా పూర్తి కాలేదు. కానీ బీజేపీ అప్పుడే క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఇచ్చి, రైతుల ఇబ్బందులు తెలుసుకుంటుంది. ఓటు బ్యాంకు రాజ‌కీయం ఎలా ఉన్నా ఇటువంటి చ‌ర్య‌లు ఎంత‌గానో రైతుల‌కు ఊర‌టను ఇస్తాయి అనేందుకు సందేహ‌మే లేదు.

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు వ‌ర‌కూ కిసాన్ మోర్చా నాయ‌కులు, అదేవిధంగా ప‌శ్చిమ తీరాన ప‌నిచేస్తున్న బీజేపీ  నాయ‌కులు క‌లిసి కోన‌సీమ ప్రాంతంలో అంటే తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించి రైతాంగం స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. తుఫాను మిగిల్చిన విషాదం తీవ్ర‌త‌ను అంచ‌నా వేసేందుకు స‌న్న‌ద్ధం అయ్యారు. నేల‌వాలిన వ‌రి పంట‌లు ఇంకా కొన్ని విధ్వంసానికి నోచుకున్న ఉద్యాన వ‌న పంట‌లు ప‌రిశీలించి ప్ర‌భుత్వానికి మేలు ర‌కం సూచ‌న‌లు చేశారు.

ఈ నేప‌థ్యంలో కిసాన్ మోర్చా నాయ‌కురాలు, అమలాపురం పార్ల‌మెంట్ నియోక‌వ‌ర్గ ఇంఛార్జ్ అల్లూరి పద్మ వ‌ర్మ ఏమంటున్నారంటే..”అనుకోకుండా ముంచుకొచ్చిన అసిని తుఫాను కార‌ణంగా అమలాపురం పార్ల‌మెంట్ నియోజకవర్గంలో రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లింది. పంటలు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. అలాగే  తడిచి రంగుమారిన ధాన్యాన్ని  మిల్లర్స్ తక్కువ ధరకు కొనడం వల్ల రైతాంగం న‌ష్ట‌పోవ‌డం ఖాయం. దీనిపై వెంటనే దృష్టి సారించి ప్ర‌ధాని ఫసల్ బీమా యోజన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలి” అని కోరుతున్నారు వీరంతా !

Read more RELATED
Recommended to you

Latest news