రాజధానిపై నేడే తీర్పు. దానికోసమే రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశమవుతోంది. ఆ తీర్పు అటూఇటూ అయితే ‘అంతే..’నంటూ రాజధాని రైతులు, జేఏసీలు హెచ్చరిస్తుంటే.. కేబినెట్ భేటీ నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో అసాధారణరీతిలో పోలీసులు మోహరించారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు పాల్పడ్డారు. ఇలాంటి టెన్షన్ వాతావరణంలోనే తొమ్మిదిరోజు రాజధాని 29 గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి. ఇక మరోవైపు రాజధాని అమరావతికి అనుకూలంగా శుక్రవారం ప్రకటన రాకపోతే కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చెయాలని అమరావతి పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. అన్ని జిల్లాల్లో ప్రజలు రోడ్లపైకి రావాలని కోరింది.
ఉదయం 10 గంటల నుంచి 12 గంటలవరకు మానవహారాలు నిర్వహించి..ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చింది. కాగా, రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాజధాని మార్పు, 13 జిల్లాల సమగ్రాభివృద్ధిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు సారథ్యంలోని కమిటీ సమర్పించిన నివేదికను సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో సంపూర్ణంగా ఆమోదించనున్నారని సమాచారం. ఇక కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న మర్నాడే అంటే శనివారమే సీఎం విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ ప్రతిపాదిత రాజధాని ప్రాంత పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.