రాబోయే ఎన్నికలే లక్ష్యంగా.. మహిళా సాధికారతే ధ్యేయంగా.. జగన్ ముందుకెళ్తున్నారనే మాటకు తాజాగా మరోసారి బలం చేకూరింది. ఇప్పటికే మున్సిపల్, కార్పొరేషన్లలో.. చైర్మన్, మేయర్ పదవుల్లోనూ మహిళలకే ప్రాధాన్యం ఇచ్చిన జగన్… తాజాగా పరిషత్ పదవుల్లోనూ మహిళలకు, ఎస్సీ, బీసీలకు సగానికి పైగా పదవులను కట్టబెడుతున్నారు!
ఈ నెల 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్మన్లు, 660 ఎంపీపీ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధికార పార్టీ వైసీపీ కసరత్తు స్టార్ట్ చేసింది. ఈ కసరత్తుల్లో… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు అత్యంధిక ప్రాధాన్యత ఇచ్చేలా అధికారపార్టీ ప్రణాళికలు చేస్తోంది!
ఇందులో భాగంగా… 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో 7 పదవులు మహిళలలు రిజర్వ్ చేస్తోన్న సర్కార్… 660 ఎంపీపీ పదవుల్లో 335 పదవులు మహిళలకు రిజర్వ్ చేసింది. అంటే సగానికి పైగా మహిళలకు ప్రభుత్వం పదవులు ఇస్తోందన్న మాట. ఇదే క్రమంలో… 660 ఎంపీపీ పదవులకు గాను 338 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించింది.
గతకొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో ముందస్తు మాటలు వినిపిస్తోన్న నేపథ్యంలో… జగన్ తీసుకున్న ఈ స్టెప్ ఆసక్తికరంగా మారింది. ఇలా జగన్ సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని పదవుల పంపిణీ చేపట్టడం.. మంచి వ్యూహాత్మక అడుగనేది విశ్లేషకుల మాటగా ఉంది.
దీంతో… ముందస్తుపై కామెంట్లకు మరింత బలం చేకూరిందనే విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అయితే… రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబందించి ఎమ్మెల్యే సీట్ల కేటాయింపుల్లో కూడా జగన్ ఈ దిశగా ఆలోచించే అవకాశం ఉందనే మాటలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే… అసెంబ్లీలో మహిళా నేతల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి.